పంతం, పట్టుదలల మధ్య నేడు చర్చలు
ABN , First Publish Date - 2020-12-30T08:40:41+05:30 IST
వ్యవసాయ చట్టాల విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రైతు సంఘాలు కానీ వెనక్కి తగ్గలేదు.

4 డిమాండ్లపై తగ్గేది లేదన్న రైతు సంఘాలు
కేంద్రం వైఖరిని ఖరారు చేసిన అమిత్‌షా
న్యూఢిల్లీ డిసెంబరు 29: వ్యవసాయ చట్టాల విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రైతు సంఘాలు కానీ వెనక్కి తగ్గలేదు. బుధవారం చర్చలు జరపాలన్న విషయంలో మాత్రమే ఏకాభిప్రాయానికి వచ్చాయి. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడంపై విధివిధానాల గురించి మాత్రమే చర్చిస్తామని, సవరణలతో సరిపెట్టడం తమకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని రైతు సంఘాలు తాజాగా కేంద్రానికి మంగళవారం రాసిన లేఖలో పేర్కొన్నాయి. మూడు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, మరో రెండు అంశాలపై మాత్రమే తాము కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పాయి. గత లేఖలో రాసిన డిమాండ్లనే పునరుద్ఘాటించాయి. బుధవారం తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీని చర్చలకు సానుకూల వాతావరణం కల్పించడం కోసం గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. మరోపక్క ప్రభుత్వం కూడా చర్చల్లో ఎలా వ్యవహరించాలనే విషయమై వ్యూహాన్ని ఖరారు చేసింది. వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోం ప్రకాశ్‌లు బుధవారం హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.
సమావేశం వివరాలేవీ మీడియాకు వెల్లడించలేదు. మరోపక్క రైతుల ఉద్యమం ఉద్ధృతం అవుతోంది. మంగళవారం బిహార్ రాజధాని పట్నాలో వేలమంది రైతులు, వామపక్షాల కార్యకర్తలు రాజ్‌భవన్ దిశగా కదం తొక్కారు. మధ్యలో పోలీసులు అడ్డుకొని లాఠీచార్జి చేశారు. పంజాబ్‌లో రిలయన్స్ టవర్ల మీద రైతుల దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం 63 టవర్లు ధ్వంసం చేశారు. టవర్ల మీద దాడులను టెలికం కంపెనీలు ఖండించాయి. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు.