‘కెప్టెన్‌’ దర్శనం కోసం నాలుగున్నరేళ్లుగా తపిస్తున్న అభిమానులు

ABN , First Publish Date - 2020-09-12T14:31:06+05:30 IST

ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ దర్శనం కోసం లక్షలాదిమంది పార్టీ కార్యకర్తలు నాలుగున్నర సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు.

‘కెప్టెన్‌’ దర్శనం కోసం నాలుగున్నరేళ్లుగా తపిస్తున్న అభిమానులు

  • కొన్నేళ్లుగా ఇంటికే పరిమితమైన విజయ్‌కాంత్‌
  • తమ నేతను చూడాలని తపిస్తున్న అభిమానులు
  • కార్యకర్తలతో  వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా మాట్లాడేందుకు ఏర్పాట్లు?


చెన్నై : ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ దర్శనం కోసం లక్షలాదిమంది పార్టీ కార్యకర్తలు నాలుగున్నర సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. తమ అభిమాన నాయకుడిని నేరుగా చూడాలని తపిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు, ఎండీఎంకే, డీపీఐ తదితర పార్టీలతో మెగా కూటమి ఏర్పాటు చేసి పోటీ చేసి ఘోర పరాజయాన్ని చవిచూసిన విజయకాంత్‌ అనారోగ్యం కారణంగా ఇంటిదగ్గరే ఉంటున్నారు. పదిహేనేళ్ల క్రితం డీఎంకే, అన్నాడీఎంకేలకు దీటుగా దేశియ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే) పేరుతో పార్టీని ప్రారంభించి తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ‘కెప్టెన్‌’ విజయకాంత్‌ 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగా పోటీకి దిగారు. ఆ ఎన్నికల్లో ఆయన మాత్రమే గెలిచారు. అదే సమయంలో 10శాతం ఓటు బ్యాంక్‌ సంపాదించుకున్నారు. పార్టీని ప్రారంభించినప్పటి నుంచి గడిచిన అసెంబ్లీ ఎన్నికల వరకూ విజయకాంత్‌ పార్టీ శ్రేణులకు అందుబాటులోనే ఉండేవారు. ప్రతి నగరంలో పార్టీ తరఫున బహిరంగ సభలకు హాజరవుతూ లక్షలాదిమంది కార్యకర్తలను కలుసుకుని వారిలో ఉత్సాహాన్ని నింపేవారు. 


2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకున్నారు. 41 సీట్లలో పోటీకి దిగారు. ఆ ఎన్నికల్లో 29 నియోజకవర్గాల్లో గెలిచి డీఎంకేని పక్కకు నెట్టి ప్రధాన ప్రతిపక్షంగా నిలిపి ప్రతిపక్ష నాయకుడిగా మారారు. అన్నాడీఎంకే అధినేత్రి, అప్పటి ముఖ్యమంత్రి జయలలితతో విరోధం పెంచుకోవడం, డీఎండీకే శాసనసభ్యులు ఎనిమిదిమంది పార్టీకి గుడ్‌బై చెప్పి అన్నాడీఎంకేలో చేరడంతో ప్రతిపక్ష హోదా కోల్పోయారు. అయినా ఆత్మస్థైర్యంతో అన్నాడీఎంకేను ఎదిరిస్తూ రాజకీయాలు నెరిపారు. అంతవరకూ సవ్యంగా సాగిన డీఎండీకే రాజకీయ కార్యకలాపాలు  2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అగమ్యగోచరంగా మారింది. ఒంటరిగా పోటీ చేయాలనుకున్న విజయకాంత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి సీపీఐ, సీపీఎం, డీపీఐ, ఎండీఎంకేల నాయకులు మెగా కూటమిని ఏర్పాటు చేసి పోటీకి దిగారు. విజయకాంత్‌ సహా కూటమిలోని అన్ని పార్టీల అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. తొలిసారిగా విజయకాంత్‌కు ఆ ఎన్నికల్లో డిపాజిట్‌ కూడా రాలేదు. ఆ ఘోరపరాజయంతో కెప్టెన్‌ మానసింగా బాగా కుంగిపోయారు. పర్యవసానంగా ఆయన ఆరోగ్యం దెబ్బతింది. మాటలు కరువయ్యాయి. ఇంటిదగ్గరే విశ్రాంతి తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇలా నాలుగేళ్లకు పైగా కెప్టెన్‌ ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో లక్షలాదిమంది కార్యకర్తలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. విజయకాంత్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ సుడిగాలిలా పర్యటించి ప్రచారం చేసేవారు.  నాలుగేళ్లుగా ఆయన ఇంటి నుంచి బయటకి వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. అదే సమయంలో ఇంటివద్దనే ఉన్న విజయకాంత్‌ను డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌, ఎండీఎంకే నేత వైగో, డీపీఐ నేత తిరుమావళవన్‌  కలుసుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామర్శించారు. 


ఇతర పార్టీల నేతలు కలుసుకున్నప్పుడు సోఫాలో గంభీరంగా కూర్చున్న విజయకాంత్‌ ఫొటోలను చూసి కార్యకర్తలంతా మురిసిపోయేవారు. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకునేందుకు రాయపేటలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయానికి సతీమణి ప్రేమలత, బావమరిది సుధీష్‌తో వెళ్లారు. ఆ సమయంలో విజయకాంత్‌ మౌనంగా ఉంటూ పొత్తుకు సంబంధించిన ఒప్పందపత్రంపై సంతకం చేసి వెళ్లిపోయారు. ఆ తరువాత తన నివాసగృహం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవం, లాక్‌డౌన్‌ బాధితులకు సహాయాల పంపిణీ, కోయంబేడు పార్టీ కార్యాలయం వద్ద వందడుగులకు పైగా  పార్టీ పతాకాన్ని ఆవిష్కరించడం వంటి కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన ముందస్తు సమాచారం ఏదీ వెల్లడించకపోవడంతో కార్యకర్తలకు ఆ వివరాలు తెలిసేదికాదు.


ఈ నేపథ్యంలో వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలోపైనా తమ కెప్టెన్‌ సంపూర్ణ ఆరోగ్యంతో జనం ముందుకు వస్తారని లక్షలాదిమంది కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. డీఎంకే, అన్నాడీఎంకే తర్వాత పార్టీ శ్రేణులు అత్యధికంగా ఉన్నది డీఎండీకేనే. ఆ పార్టీకి మొదటి నుంచి ఇప్పటివరకూ కార్యకర్తల బలం ఏ మాత్రం తగ్గలేదు. విజయకాంత్‌ ఆదేశాలను  తప్పకుండా ఆచరించే సైనికుల్లా కార్యకర్తలు వ్యహరిస్తుంటారు. నాలుగేళ్లకు పైగా ఇంటి పట్టునే విశ్రాంతి తీసుకుంటున్న కెప్టెన్‌ త్వరగా తమ ముందుకు రావాలని, మునుపటిలా ఆప్యాయంగా పలకరించాలని కార్యకర్తలంతా ఎదురు చూస్తున్నారు. కనీసం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అయినా కెప్టెన్‌ తమతో మాట్లాడితే చాలని కార్యకర్తలు భావిస్తున్నారు. పార్టీ శ్రేణుల కోరికను నెరవేర్చేందుకు కెప్టెన్‌ సతీమణి, పార్టీ కోశాధికారి ప్రేమలత తగిన ఏర్పాట్లు చేపడుతున్నారు. త్వరలో విజయకాంత్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కార్యకర్తలను పలకరిస్తారని తెలుస్తోంది.


పార్టీ వర్గాల సమాచారం మేరకు విజయకాంత్‌ ప్రస్తుతం ఇంటివద్దనే విశ్రాంతి తీసుకుంటూ రోజూ తేలికపాటి వ్యాయామాలు చేస్తున్నారు. గతం కంటే ఆయన సులువుగా ఎవరి ఆసరా లేకుండా లేచి నడవడమేకాకుండా, సైక్లింగ్‌ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో త్వరలో సంపూర్ణంగా కోలుకుని ప్రజల ఎదుట హాజరై మునుపటిగా తన గంభీర స్వరాన్ని వినిపిస్తారని, వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు  చేస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. అదే వాస్తవమైతే అంతకు మించిన సంతోషం తమకేముంటుందని కార్యకర్తలు అంటున్నారు. నాలుగేళ్లకు పైగా కెప్టెన్‌ దర్శనం కోసం ఎదురు చూస్తున్న తాము మరో ఏడు నెలల వరకు వేయికళ్ళతో ఆయన రాకకోసం ఎదురు చూస్తామని చెబుతున్నారు.

Updated Date - 2020-09-12T14:31:06+05:30 IST