మాజీ ప్రధాని సోదరుడు కన్నుమూత
ABN , First Publish Date - 2020-03-27T23:46:57+05:30 IST
మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ సోదరుడు, ప్రముఖ చిత్రకారుడు సతీశ్ గుజ్రాల్ గురువారం కన్నుమూశారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ సోదరుడు, ప్రముఖ చిత్రకారుడు సతీశ్ గుజ్రాల్ గురువారం కన్నుమూశారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన 94ఏళ్ల సతీశ్.. ఆర్కిటెక్ట్, పియానిస్ట్, మురళి విద్వాంసుడు, రచయిత, చిత్రకారుడు ఇలా చాలా రంగాల్లో తనదైన ముద్ర వేశారు. ఢిల్లీలోని బెల్జియం ఎంబసీ రూపకర్త ఆయనే. సతీశ్ మృతి వార్త తెలుసుకున్న ప్రధాని మోదీ స్పందించారు. 'బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సతీశ్ గుజ్రాల్ గారి మరణం కలచివేసింది. పట్టుదలతో తనకు ఎదురైన సమస్యలను ఆయన అధిగమించారు. ఆయన జ్ఞానం ప్రపంచ ప్రసిద్ధిని తెచ్చిపెట్టింది. అయినా తన మూలాలను ఆయన ఎప్పుడూ మరిచిపోలేదు. ఆయన మరణం చాలా బాధకలిగించింది. ఓం శాంతి' అని మోదీ ట్వీట్ చేశారు.