కరోనా అనుమానంతో సాంఘిక బహిష్కరణ.. భరించలేని యువకుడు ఏం చేశాడంటే?
ABN , First Publish Date - 2020-04-06T00:47:32+05:30 IST
కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో గ్రామస్థులు సోషల్ బాయ్‌కాట్ చేయడంతో భరించలేని యువకుడు

సిమ్లా: కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో గ్రామస్థులు సాంఘిక బహిష్కరణ చేయడంతో అవమానం భరించలేని యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో జరిగిందీ ఘటన. జిల్లాలోని బన్‌గఢ్ గ్రామానికి చెందిన 37 ఏళ్ల మొహమ్మద్ దిల్షాద్‌లో కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యాధికారులు అతడిని క్వారంటైన్‌కు తరలించారు. కొన్ని రోజుల పాటు అతడిని క్వారంటైన్‌లో ఉంచిన అధికారులు తాజాగా మరోమారు పరీక్షించారు. పరీక్షల్లో నెగటివ్ రిపోర్టులు రావడంతో అతడిని గ్రామంలో వదిలిపెట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన తబ్లిఘి జమాత్ సభ్యుడిని దిల్షాద్ కలవడంతోనే అతడిని క్వారంటైన్‌కు తరలించినట్టు ఉనా సదర్ ఎస్‌హెచ్‌వో దర్శన్ సింగ్ తెలిపారు.
దిల్షాద్ గ్రామంలోకి వచ్చాక గ్రామస్థులు అతడిని అనుమానంగా చూడడం మొదలుపెట్టారు. అతడిపై వివక్ష చూపడమే కాకుండా సాంఘిక బహిష్కరణ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దిల్షాద్ ఈ ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు డీజీపీ సీతా రామ్ మర్ది తెలిపారు. సాంఘిక బహిష్కరణపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.