కరోనాపై యుద్ధానికి ముందుకొచ్చిన ఫేస్‌బుక్

ABN , First Publish Date - 2020-03-23T20:53:57+05:30 IST

ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19పై యుద్ధానికి ముందుకొస్తున్న టెక్ కంపెనీల జాబితాలో తాజాగా ఫేస్‌బుక్...

కరోనాపై యుద్ధానికి ముందుకొచ్చిన ఫేస్‌బుక్

న్యూఢిల్లీ: ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19పై యుద్ధానికి ముందుకొస్తున్న టెక్ కంపెనీల జాబితాలో తాజాగా ఫేస్‌బుక్ కూడా చేరింది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు వీలుగా 7.2 లక్షల ఫేస్ మాస్క్‌లను విరాళంగా పంపినట్టు ఫేస్‌బుక్ చీఫ్ మార్క్ జుకెర్‌బర్గ్ వెల్లడించారు. మరోవైపు తాము ఇప్పటికే సిద్ధం చేసి పంపిన ఫేస్‌మాస్క్‌లు రవాణా మధ్యలో నిలిచిపోయాయని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. అమెరికాలో కోవిడ్-19 ప్రభావం ఎక్కువగా ఉన్న సీటెల్‌ కోసం ఆయన పెద్దఎత్తున వ్యక్తిగత సంరక్షక వస్తువులను పంపించారు. అయితే ఆయన పంపిన వస్తువులు ఎందుకు ఆగిపోయాయన్న విషయం ఆయన వెల్లడించకపోయినప్పటికీ.. లాస్‌ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నెలకొన్న లాజిస్టిక్ సమస్యలే దీనికి కారణమని చెబుతున్నారు. 


ఫేస్‌బుక్ జర్నలిజం ప్రాజెక్టు విభాగం సైతం కరోనా వైరస్‌పై న్యూస్ రిపోర్టింగ్‌ కోసం మిలియన్ డాలర్ల నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. కాగా ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ సహ యజమాని జాక్ మా సైతం ప్రపంచ దేశాల కోసం ఫేస్ మాస్కులు, టెస్ట్ కిట్‌లు, వెంటిలేటర్లు, సంరక్షక సాధనాలు పంపిణీ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ కూడా కోవిడ్-19 కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీటెల్ ప్రాంత వాసులకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. 

Updated Date - 2020-03-23T20:53:57+05:30 IST