దావూద్ అనుచరుడిని భారత్‌కు అప్పగించకుండా అడ్డుకున్న పాక్ సంతతి మంత్రి

ABN , First Publish Date - 2020-05-19T00:35:38+05:30 IST

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు టైగర్ హనీఫ్‌ను తమకు అప్పగించాలంటూ భారత్‌ చేసిన..

దావూద్ అనుచరుడిని భారత్‌కు అప్పగించకుండా అడ్డుకున్న పాక్ సంతతి మంత్రి

లండన్: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు టైగర్ హనీఫ్‌ను తమకు అప్పగించాలంటూ భారత్‌ చేసిన విజ్ఞప్తిని బ్రిటీష్ ప్రభుత్వం తిరస్కరించింది. ఈ విషయాన్ని తాజాగా యూకే హోం మంత్రిత్వ శాఖ వర్గాలు ధ్రువీకరించాయి. 1993 సూరత్ బాంబు పేలుళ్ల కేసులో హనీఫ్ నిందితుడిగా ఉన్నాడు. 1993 జనవరిలో సూరత్‌లోని వరాచా రోడ్డులో తొలి పేలుడు సంభవించగా.. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పో్యింది. అదే ఏడాది ఏప్రిల్‌లో సూరత్ రైల్వే స్టేషన్ వద్ద రెండోసారి పేలుడు చోటుచేసుకుంది.


2010 ఫిబ్రవరిలో స్కాట్‌లాండ్ పోలీసులు నేరస్తుల అప్పగింత వారెంటు కింద అతడిని అరెస్టు చేశారు. గ్రేటర్ మాంచెస్టర్‌లోని బోల్టన్‌లో ఓ కిరాణా షాపు వద్ద హనీఫ్ పట్టుబడ్డాడు. అతడి పూర్తిపేరు మహ్మద్ హనీఫ్ ఉమర్జీ పటేల్. అతడిని భారత్‌కు అప్పగించాలంటూ తొలుత జూన్‌ 2012లో నాటి హోంమంత్రి థెరిస్సా మే నిర్ణయం తీసుకున్నారు. అయితే తనను భారత్‌కు అప్పగిస్తే చిత్రహింసలు పెడతారని ఆరోపిస్తున్న 57 ఏళ్ల ఈ ఉగ్రవాది... న్యాయ పోరాటం చేస్తూ బ్రిటన్‌లోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో 2019లో నాటి బ్రిటన్ హోంమంత్రి, పాకిస్తాన్ సంతతి నేత సాజిద్ జావిద్.. హనీఫ్‌ అప్పగింతను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుని అతడిని కాపాడారు. ‘‘హనీఫ్ పటేల్ అప్పగింత విజ్ఞప్తిని నాటి హోంమంత్రి సాజిద్ జావిద్ తిరస్కరించారని ధ్రువీకరించగలం. 2019 ఆగస్టులో కోర్టు అతడిని విడుదల చేసింది..’’ అని యూకే హోంమంత్రిత్వ శాఖ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

Updated Date - 2020-05-19T00:35:38+05:30 IST