‘కోవ్యాక్సిన్’ తీసుకున్నా.. కరోనా!!
ABN , First Publish Date - 2020-12-06T06:53:12+05:30 IST
యావత్ భారతదేశం హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధిచేసిన కోవ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది.

ప్రయోగాత్మక వ్యాక్సిన్ వేయించుకున్న ..హరియాణా ఆరోగ్య మంత్రికి ‘పాజిటివ్’
మొదటి డోసు అందించిన.. రెండువారాలకు అనిల్ విజ్‌కు ఇన్ఫెక్షన్ నిర్ధారణ
చండీగఢ్, డిసెంబరు 5: యావత్ భారతదేశం హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధిచేసిన కోవ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో కోవ్యాక్సిన్‌తో జరుగుతున్న మూడోదశ ప్రయోగ పరీక్షల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. తొలి వలంటీర్‌గా మారి, అంబాలా కంటోన్మెంట్‌లోని సివిల్ ఆస్పత్రిలో నవంబరు 20న కోవ్యాక్సిన్ మొదటి డోసు ను వేయించుకున్న హరియాణా ఆరోగ్య, హోంశాఖల మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనిల్ విజ్(67)కు.. రెండు వారాల తర్వాత కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన చికిత్స నిమిత్తం వెంటనే అదే ఆస్పత్రిలో చేరారు. ఈ వివరాలను ట్విటర్ వేదికగా శనివారం అనిల్ విజ్ వెల్లడించారు. ‘‘గత కొన్ని రోజులుగా నాతో సన్నిహితంగా మెలిగినవారు పరీక్షలు చేయించుకోండి’’ అని తన అనుచరులు, పార్టీ నేతలు, అధికారులకు ఆయన సూచించారు. ‘‘మొదటి డోసు వేసిన 28 రోజుల తర్వాత రెండో డోసును వేస్తామని నాకు చెప్పారు. రెండో డోసు వేసిన 14 రోజుల తర్వాతే పూర్తిస్థాయిలో యాంటీబాడీలు విడుదలవుతాయన్నారు. అంటే ఇదంతా పూర్తి కావడానికి 42 రోజుల సమయం పడుతుంది.
ఈ వ్యవధిలో కరోనా నుంచి రక్షణ లభించద ని నాతో వైద్యులు చెప్పారు’’ అని పీటీఐ వార్తాసంస్థకు విజ్ వివరించారు. మొత్తం మీద తాను బాగానే ఉన్నాన ని.. అయితే గొంతుమంట, జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతున్నట్లు ఆయన చెప్పారు. ‘‘జ్వరం వచ్చినట్లు అనిపించడంతో శనివారం టెస్టు చేయించుకున్నాను. ‘పాజిటివ్’ వచ్చింది’’ అని విజ్ తెలిపారు. డిసెంబరు 4న జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) అగ్రనేతలు దిగ్విజయ్‌సింగ్ చౌతాలా, నిశాన్ సింగ్.. 2న యోగా గురువు బాబా రామ్‌దేవ్, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తనను కలిశారన్నారు. కాగా, ఈ వ్యవహారంపై కేంద్ర ఆరోగ్యశాఖ కూడా స్పందించింది. ‘‘ఇది రెండు డోసుల వ్యాక్సిన్. రెండో డోసును వేయించుకున్న రెండు వారాల తర్వాతే ప్రభావం మొదలవుతుంది. అయితే అనిల్ విజ్ ఇప్పటివరకు ఒకటే డోసును వేయించుకున్నారు’’ అని వెల్లడించింది.
ప్రభావం 42 రోజుల తర్వాతే..
తమది రెండు డోసుల వ్యాక్సిన్ అని భారత్ బయోటెక్ తె లిపింది. మొదటి డోసును వేయించుకున్న 28 రోజుల తర్వాత వలంటీర్ రెండో డోసును వేయించుకోవాల్సి ఉంటుందని పేర్కొం ది. కోవ్యాక్సిన్ సిసలైన ప్రభావం అనేది రెండో డోసును వేయించుకున్న 14 రోజుల తర్వాతే(42 రోజులకు) మొదలవుతుందని శనివా రం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రజారోగ్య భద్రతే పరమావధిగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించింది. దాని ప్రభావశీలతపై స్పష్టమైన నిర్ధారణకు వచ్చేందుకే.. దేశంలో 26వేల మంది వలంటీర్లపై వ్యాక్సిన్‌ను పరీక్షిస్తున్నట్లు తెలిపింది. గత 20 ఏళ్లలో 18కిపైగా దేశాల్లో 80కిపైగా ప్రయోగ పరీక్షలు నిర్వహించిన అనుభవం తమ కంపెనీ సొంతమని భారత్ బయోటెక్ తెలిపింది.