యూరప్‌ను మళ్లీ కబళిస్తున్న కరోనా మహమ్మారి

ABN , First Publish Date - 2020-12-12T02:21:12+05:30 IST

కరోనా మహమ్మారి యూరప్‌ను మరోమారు వణికిస్తోంది. వైరస్ బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతోంది

యూరప్‌ను మళ్లీ కబళిస్తున్న కరోనా మహమ్మారి

లండన్: కరోనా మహమ్మారి యూరప్‌ను మరోమారు వణికిస్తోంది. వైరస్ బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతోంది. దీంతో యూరప్ దేశాలు పరీక్షలు, రెస్క్యూ ఆసుపత్రులను విస్తరించడంలో మరోమారు బిజీగా మారాయి. త్వరలోనే బ్రిటన్‌లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న ఆశాజనక వార్తలు జోరందుకున్నప్పటికీ, కరోనా మరణాలు తగ్గించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రష్యా, జర్మనీలలో శుక్రవారం రికార్డుస్థాయిలో కరోనా మరణాలు నమోదయ్యాయి. అక్టోబరు అయితే రష్యాకు నిజంగా ఓ పీడకలే. స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌లో అయితే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు 99 శాతం రోగులతో నిండిపోయాయి. లాక్‌డౌన్‌ను సడలించబోవడం లేదని ఫ్రాన్స్ స్పష్టం చేసింది. 


జర్మనీలో 24 గంటల వ్యవధిలో 598 మరణాలు సంభవించాయి. అలాగే, శుక్రవారం కొత్తగా 29,875 మంది కరోనా బారినపడ్డారు. అంతకుముందు రోజు నమోదైన కేసులతో పోలిస్తే ఆరువేలు అధికంగా కేసులు నమోదు కావడం గమనార్హం. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు, లాక్‌డౌన్ నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు జర్మనీ సమాయత్తమవుతోంది. సెలవుల నేపథ్యంలో ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ ప్రజలను కోరారు. వైరస్‌ను అడ్డుకునేందుకు మరిన్ని ఆంక్షలు ఉంటాయని చెప్పారు. తొలి దశలో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసినప్పటికీ కరోనా సెకండ్ వేవ్‌ను మాత్రం జర్మనీ అడ్డుకోలేకపోయింది.  

Updated Date - 2020-12-12T02:21:12+05:30 IST