మోదీ చొరవతో జగన్నాథ యాత్రకు లైన్‌క్లియర్: అమిత్‌షా
ABN , First Publish Date - 2020-06-23T01:00:51+05:30 IST
ఒడిస్సాలోని వార్షిక జగన్నాథ రథయాత్ర నిర్వహణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై కేంద్ర హోం మంత్రి...

న్యూఢిల్లీ: ఒడిస్సాలోని వార్షిక జగన్నాథ రథయాత్ర నిర్వహణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయంతో యావద్దేశం ఆనందంగా ఉందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆయన వరుస ట్వీట్లలో తన సంతోషాన్ని పంచుకున్నారు.
'ఇవాళ మనందరికీ ప్రత్యేకమైన రోజు. ముఖ్యంగా ఒడిశా సోదర సోదరీమణులకు, మహాప్రభు శ్రీ జగన్నాథ్ భక్తులకు ఇది చాల ప్రత్యేకం. రథయాత్ర జరుగుతుండటం యావద్దేశ ప్రజలకు సంబరాన్ని తెచ్చింది' అని అమిత్‌షా అన్నారు.
మరో ట్వీట్‌లో ప్రధాని మోదీ తీసుకున్న చొరవను అమిత్‌షా ప్రశంసించారు. 'భక్తుల మనోభావాలను అవగాహన చేసుకోవడమే కాకుండా అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించేందుకు మోదీ సంప్రదింపులు జరిపారు. ఇది నాతో పాటు కోట్లాది మంది భక్తులకు ఆనందం కలిగించింది' అని అమిత్‌షా అన్నారు. ఆదివారం రాత్రి మోదీ ఆదేశాల మేరకు పూరీ రాజు గజపతి మహరాజ్‌తోనూ, పూరీ శంకరాచార్యులతోనూ తాను మాట్లాడినట్టు చెప్పారు. యాత్రపై వారి అభిప్రాయాలకు కూడా తెలుసుకుని ప్రధాని ఆదేశాలతో సోమవారం ఉదయం సొలిసిటర్ జనరల్‌తో కూడా మాట్లాడానని అన్నారు. ఇది అత్యవసర అంశంగా సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు రావడం, రథయాత్రకు మార్గం సుగమం చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని చెప్పారు. ఒడిశా ప్రజలకు అభినందనలు తెలిపారు.