జాబ్ పేరుతో ఇంజినీర్‌కు రూ.28 లక్షలు టోకరా.. సెక్యురిటీ గార్డ్ అరెస్ట్!

ABN , First Publish Date - 2020-10-07T22:35:48+05:30 IST

ఉద్యోగ అవకాశం పేరుతో ప్రముఖ కంపెనీ నుంచి ఫోన్ చేసినట్టు నమ్మించి ఓ ఇంజినీర్‌ను రూ.28 లక్షల మేర మోసగించిన వైనమిది.

జాబ్ పేరుతో ఇంజినీర్‌కు రూ.28 లక్షలు టోకరా.. సెక్యురిటీ గార్డ్ అరెస్ట్!

న్యూఢిల్లీ: ఉద్యోగ అవకాశం పేరుతో ప్రముఖ కంపెనీ నుంచి ఫోన్ చేసినట్టు నమ్మించి ఓ ఇంజినీర్‌ను రూ.28 లక్షల మేర మోసగించిన వైనమిది. ఈ కేసులో ఓ సెక్యురిటీ గార్డును ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు.. అసలు సూత్రధారి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడు పింకేశ్ కుమార్ నోయిడాలోని ఓ హౌసింగ్ ప్రాజెక్టులో సెక్యురిటీ గార్డుగా పనిచేశాడు. రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి పింకేశ్‌ను కలిసి అతడి బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వమని కోరాడు. తాను పింకేశ్ ఖాతాలో డబ్బులు వేస్తాననీ.. వాటిని డ్రా చేసి ఇస్తే కమిషన్ ఇస్తానంటూ ఆశచూపించాడు. దీంతో పింకేశ్ పలు బ్యాంకుల్లో్ ఖాతాలు తెరిచాడు. పింకేశ్ మోసం చేయగా వేసిన డబ్బులు డ్రా చేస్తూ 10 శాతం కమిషన్ తీసుకునేవాడు. ఇదిలా ఉండగా, తనను ఉద్యోగం పేరుతో మోసం చేశారంటూ మాలవీయ నగర్‌కు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.


వృత్తి రీత్యా ఇంజినీర్ అయిన ఆమె.. ఓ ప్రముఖ కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తూ మరో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై మొదటి వారంలో ఆమెకు ఓ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (వీవోఐపీ) ద్వారా కాల్ వచ్చింది. తాను ఆన్‌లైన్ జాబ్ పోర్టల్ నుంచి మాట్లాడుతున్నాననీ.. తనపేరు రాహుల్ అని పరిచయం చేసుకున్నాడు. డీఎల్ఎఫ్ లిమిటెడ్ ఆమె సీవీని ఎంపిక చేసిందని నమ్మించాడు. కొద్ది రోజుల తర్వాత ఆమెకు మరోసారి వీవోఐపీ ద్వారా కాల్ వచ్చింది. తాను డీఎస్ఎఫ్ హెచ్‌ఆర్‌ని మాట్లాడుతున్నాననీ.. మంచి ప్యాకేజీతో ఆమెకు సీనియర్ మేనేజర్ ఉద్యోగం వచ్చిందని నమ్మించాడు. బాండ్ కింద రూ. 28 లక్షలు చెల్లించాలనీ... తొలుత రూ. 6.8 లక్షలు చెల్లించాలని అతడు కోరాడు. అనంతరం ఆమె వేర్వేరు బ్యాంకు ఖాతాల్లోకి మొత్తం రూ. 28 లక్షలు డిపాజిట్ చేసింది. తీరా డబ్బులు డిపాజిట్ చేశాక తాను మోసపోయానని గుర్తించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. తర్వాత కొద్దిరోజులకే తాను మోసపోయానని తెలుసుకున్న ఆమె పోలీసులను ఆశ్రయించింది. కాగా ఈ వ్యవహారంపై విచారణ చేపట్టామనీ.. ఇప్పటికే నిందితుల బ్యాంకు ఖాతాల వివరాలు, కాల్ చేసిన నంబర్‌లను రాబట్టామని డీసీపీ (సౌత్) అతుల్ కుమార్ ఠాగూర్ వెల్లడించారు. సాంకేతిక నిపుణుల సాయంతో కాల్ డిటైల్ రికార్డ్ సహా పలు కీలక ఆధారాలు సేకరించారు. వీటి ఆధారంగా ఇప్పటికే కుమార్‌ను నోయిడా సమీపంలోని ఓ గ్రామంలో అరెస్ట్ చేయగా... అసలు నిందితుడి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు.

Updated Date - 2020-10-07T22:35:48+05:30 IST