ఎలక్టోరల్ కాలేజీ ఓటింగ్ ప్రారంభం
ABN , First Publish Date - 2020-12-15T09:09:05+05:30 IST
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకఘట్టమైన ఎలక్టోరల్ కాలేజీ ఓటింగ్ సోమవారంనాడు ఆరంభమైంది.

306 ఓట్లతో బైడెన్ లాంఛనంగా ఎన్నికయ్యే చాన్స్
హింస భయంతో భద్రత కట్టుదిట్టం
వాషింగ్టన్, డిసెంబరు 14: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకఘట్టమైన ఎలక్టోరల్ కాలేజీ ఓటింగ్ సోమవారంనాడు ఆరంభమైంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం ముగి సింది. ఒకటొకటిగా అనేక రాష్ట్రాల్లో ఎలక్టర్లు తమ తమ పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేస్తున్నారు. ఈసారి ఎలక్టర్స్‌లో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన భార్య హిల్లరీలు కూడా ఉన్నారు. వీరు న్యూయార్క్‌లో డెమొక్రాట్ల తరఫున స్వచ్ఛందంగా ఈ ఎలక్టర్లుగా నియమితులు కావడం విశే షం. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం ఓట్లు 538. ఇందులో సగం అంటే 270 సాధించినవారు అధ్యక్షుడిగా లాంఛనంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. నవంబరు 3న జరిగిన పోలింగ్‌లో వచ్చిన పాపులర్ ఓట్ల ప్రకారం ఇప్పటికే డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ తన ప్రత్యర్థి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే మంచి ఆధిక్యం సాధించారు. అయితే ఎలక్టోరల్ కాలేజీలో మేజిక్ ఫిగర్ (270) సాధిస్తేనే అధ్యక్షుడవుతారన్నది అమెరికా రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. బైడెన్‌కు 306 ఎలక్టోరల్ ఓట్లు వస్తాయని, ఆయన గెలుపు లాంఛనమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్‌కు 232 ఓట్లు లభించవచ్చన్నది అంచనా. ఒకవేళ ఇద్దరికీ సమానంగా వచ్చి టై అయితే అప్పుడు అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల సభ అధ్యక్షుణ్నీ, సెనెట్ ఉపాధ్యక్షుణ్నీ నియమిస్తుంది. ఈ రకంగా చూసినా బైడెన్ గెలుపు తప్పదు. కాగా, 10 ప్రభావ రాష్ట్రాల్లో ఎన్నిక హోరాహోరీ జరిగినందున, అక్కడ బైడెన్ గెలుపును ట్రంప్ కోర్టుల్లో సవాలు చేసినందునా- అక్కడి ఓటింగ్‌పై అందరి దృష్టీ కేంద్రీకృతమయింది. హింస ప్రబలవచ్చన్న అనుమానంతో ఆ పది రాష్ట్రాల్లో భద్రతను రెట్టింపు చేశారు.