ఎన్నికల నజరానా

ABN , First Publish Date - 2020-12-20T13:54:55+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పొంగల్‌ పండుగకు రేషన్‌ కార్డుదారులకు ఇచ్చే నగదు కానుకను రెట్టింపు ..

ఎన్నికల నజరానా

ఎడప్పాడి పొంగల్‌ కానుక

రేషన్‌ కార్డుదారులకు రూ.2500

జనవరి 4 నుంచి పంపిణీ


చెన్నై, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పొంగల్‌ పండుగకు రేషన్‌ కార్డుదారులకు ఇచ్చే నగదు కానుకను రెట్టింపు చేశారు. ఓ వైపు కరోనా వైరస్‌ వ్యాప్తి, మరో వైపు నివర్‌, బురేవి తుపానులు సృష్టించిన నష్టంతో తల్లడిల్లుతున్న ప్రజలను ఆర్థికంగా ఆదుకోవాలని ముఖ్యమంత్రి ఎడప్పాడికి మంత్రివర్గ సభ్యులంతా సూచిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం తన సొంత నియోజకవర్గమైన ఎడప్పాడి వద్ద ముఖ్యమంత్రి పళనిస్వామి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పొంగల్‌ కానుకకు సంబంధించిన ప్రకటించారు.


గత కొన్నేళ్లుగా అన్నాడీఎంకే ప్రభుత్వం సంక్రాంతి పండుగకు రేషన్‌షాపుల్లో పచ్చి బియ్యంతోపాటూ కార్డుదారులందరికీ రూ.1000, చక్కెర, యాలుకులు, జీడిపప్పు, చెరకు ముక్కలను కానుకగా పంపిణీ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్నాడీఎంకే ప్రభుత్వం నగదుకానుకను  రెట్టింపు చేసింది. ఆ మేరకు ప్రతి బియ్యం కార్డుదారుడికి రూ.2500, కిలో పచ్చిబియ్యం, కిలో చక్కెర, ఐదు గ్రాముల యాలకులు, ఐదు గ్రాముల జీడిపప్పులు, ఐదు గ్రాముల ఎండుద్రాక్ష, చెరకు గడను పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. జనవరి 4 నుంచి ఈ సంక్రాంతి కానుకలను రాష్ట్రవ్యాప్తంగా 2.06 కోట్ల మంది బియ్యం కార్డుదారులు అందుకోనున్నారు.

Updated Date - 2020-12-20T13:54:55+05:30 IST