లాక్‌డౌన్‌పై వైద్యనిపుణుల కమిటీతో సీఎం భేటీ
ABN , First Publish Date - 2020-12-28T18:10:02+05:30 IST
కొత్త రూపు సంతరించుకున్న కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి

చెన్నై : కొత్త రూపు సంతరించుకున్న కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టడంపై ముఖ్యమంత్రి పళనిస్వామి సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్యనిపుణులతో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టుదిట్టం చేసేందుకు మార్చి 25 నుంచి డిసెంబరు 31వ తేదీ వరకు లాక్‌డౌన్ విధించారు. ఇది అమలులో ఉన్నప్పటికీ, ప్రజల కోసం దుకాణాలు, హోటళ్లు, షాపింగ్‌మాల్స్, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు తెరవడానికి, రైళ్లు, బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు నడిపేం దుకు రాష్ట్రప్రభుత్వం అనుమతించింది.
తొమ్మిది నెలలుగా మూతపడిన ఆలయాలు, చర్చిలు, మసీదులకు విధించిన నిబంధనలను కూడా సడలించింది. ఈ నేపథ్యంలో, బ్రిటన్‌లో రూపు మారి వేగం పెంచుకున్న కరోనా కొత్త వైరస్ విజృంభిస్తుండడంతో మళ్లీ విదేశాల్లో లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది. విదేశాల నుంచి విమానాల ద్వారా రాష్ట్రానికి వస్తున్న ప్రయాణికులను క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ప్రస్తుతం రాజధాని నగరంలో 1,034 మంది సహా 2,391 మంది విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు కరోనా వైద్యపరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా, వారితో సంబంధాలున్న వారికి కూడా వైద్యపరీక్షలు నిర్వహించి నెగెటివ్ ఉన్న వారిని మాత్రమే వారివారి ఇళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించింది. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షణ్ముగం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శనివారం సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు జిల్లా కలెక్టర్లతో సమావేశమై చర్చించారు.
రాష్ట్రంలో జనవరి 1 నుంచి కొత్త నిబంధనలతో లాక్‌డౌన్ ప్రకటించవచ్చా? అని ఆయన కలెక్టర్ల అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా, 2021వ సంవత్సరం ప్రారంభం కానుండడంతో కరోనా వ్యాప్తిని పూర్తిస్థ్థాయిలో అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలు, చికిత్సా విధానం, పరిశోధనలు పెంచడం తదితర అంశాలపై ముఖ్యమంత్రి పళనిస్వామి సోమవారం సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్యరంగ నిపుణులతో సమావేశమై నిర్ణయం ప్రకటించనున్నారు.