బెంగాల్ లో రెండు రోజుల పాటు పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం
ABN , First Publish Date - 2020-12-17T16:02:56+05:30 IST
కరోనా మహమ్మారి ఓ వైపు, టీఎంసీ, బీజేపీ ఘర్షణాత్మక వాతావరణం మరోవైపు. వెరసి.. బెంగాల్ లో ఎన్నికలు నిర్వహించడం

కోల్‌కతా : కరోనా మహమ్మారి ఓ వైపు, టీఎంసీ, బీజేపీ ఘర్షణాత్మక వాతావరణం మరోవైపు. వెరసి.. బెంగాల్ లో ఎన్నికలు నిర్వహించడం కేంద్ర ఎన్నికల సంఘానికి సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే బెంగాల్ లో క్షేత్ర స్థాయి పరిస్థితులను అధ్యయనం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం బెంగాల్ లో పర్యటిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ సుదీప్ జైన్ ఆధ్వర్యంలో ఓ బృందం కోల్‌కతాకు చేరుకుంది. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్లు, ఎస్పీలు, ఇలా... ఆయా జిల్లా అధికారులందరితోనూ ఈ బృందం భేటీ కానుంది. కరోనా సమస్య, రాజకీయంగా వైరి పక్షాలు కత్తులు దూస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఆరోగ్య శాఖ, హోంశాఖ కార్యదర్శులు ప్రత్యేకంగా ఈ బృందంతో భేటీ కానున్నారు. ‘‘ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం వచ్చింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తారు. వీరితో పాటు అన్ని రాజకీయ పక్షాలకు చెందిన నేతలతోనూ భేటీ అవుతారు.’’ అని సీనియర్ అధికారి వెల్లడించారు. వీటితో పాటు పోలింగ్ తేదీ రోజున అన్ని పోలింగ్ బూత్‌లలో ఉంచాల్సిన మౌలిక సదుపాయాలపై కూడా దృష్టి సారించనుంది.