మధ్య ప్రదేశ్ ప్రభుత్వాధికారులపై క్రిమినల్ కేసులకు ఈసీ ఆదేశం

ABN , First Publish Date - 2020-12-17T18:16:37+05:30 IST

2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో అక్రమ నగదు లావాదేవీలకు

మధ్య ప్రదేశ్ ప్రభుత్వాధికారులపై క్రిమినల్ కేసులకు ఈసీ ఆదేశం

న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో అక్రమ నగదు లావాదేవీలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వాధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) కొరడా ఝళిపించింది. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మధ్య ప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌ను ఆదేశించింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) నివేదిక ఆధారంగా ఈ చర్యలకు ఆదేశించింది. వీరిపై తగిన శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శిని, మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా ఆదేశించింది. 


2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన సోదాల్లో కొందరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు వెల్లడైంది. వీరంతా అప్పటి మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు సన్నిహితులనే ఆరోపణలు ఉన్నాయి. సుశోభన్ బెనర్జీ, సంజయ్ మనే, అరుణ్ మిశ్రా, వీ మధు కుమార్ లెక్కల్లో చూపని నగదు లావాదేవీలకు పాల్పడినట్లు ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. వీరి నుంచి కోట్లాది రూపాయలు స్వాధీనం చేసుకుంది. హవాలా నెట్‌వర్క్ ద్వారా ఢిల్లీకి భారీ మొత్తంలో నిధులను పంపించినట్లు తెలిపే డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. 


Updated Date - 2020-12-17T18:16:37+05:30 IST