ప్లాస్టిక్ తినే క్రి ములొచ్చేశాయ్!
ABN , First Publish Date - 2020-09-18T08:04:25+05:30 IST
ప్లాస్టిక్ వ్యర్థాలను ఎంచక్కా తినేసి పర్యావరణానికి మేలు చేసే సూక్ష్మ క్రిములు ఉన్నట్టు కర్ణాటక విశ్వవిద్యాలయానికి చెందిన బయోటెక్నాలజీ విద్యార్థి ఒకరు గుర్తించారు...

- కర్ణాటక యూనివర్సిటీ విద్యార్థి అపూర్వ అన్వేషణ
బెంగళూరు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): భూమిలో పడిన ప్లాస్టిక్ వస్తువులు ఏళ్ల తరబడి మట్టిలో కలిసిపోకుండా అలాగే ఉంటున్నాయి. ఇది పర్యావరణానికి పెను ప్రమాదంగా పరిణమించిందనే ఆందోళనల నేపథ్యంలో.. ఈ సమస్యకు పరిష్కారం చూపే సరికొత్త అన్వేషణ తెరపైకి వచ్చింది. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎంచక్కా తినేసి పర్యావరణానికి మేలు చేసే సూక్ష్మ క్రిములు ఉన్నట్టు కర్ణాటక విశ్వవిద్యాలయానికి చెందిన బయోటెక్నాలజీ విద్యార్థి ఒకరు గుర్తించారు. అంతేకాదు ప్రయోగాత్మంకగానూ నిరూపించారు. ధార్వాడలోని కర్ణాటక విశ్వవిద్యాలయ పరిశోధనా విభాగాధిపతి డాక్టర్ సీటీ శివకరణ మార్గదర్శకత్వంలో శీతల్ కెస్తి అనే విద్యార్థి ఈ అన్వేషణను విజయవంతంగా పూర్తిచేశాడు. భూమిలోని ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు భవిష్యత్తులో ఈ సూక్ష్మక్రిముల రూపంలో చక్కటి పరిష్కారం దొరికే అవకాశముందని శీతల్ అంటున్నాడు. ఇంగ్లండ్‌లోనూ ఇదే అంశంపై పరిశోధనలు జరుగుతున్నట్లు తాను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నట్లు చెప్పాడు. కోర్‌స్కెరా సెఫలోనికా అనే శాస్త్రీయనామం కలిగిన ఈ క్రిమిని తొలుత స్పెయిన్ పరిశోధకులు గుర్తించగా మరో సూక్ష్మక్రిమిని గెల్లేరియా మెలోనెల్లా పేరిట భారత్‌లోని శాస్త్రవేత్తలు తెరపైకి తీసుకురావడం గమనార్హం.