గడప దాటని ప్రపంచం

ABN , First Publish Date - 2020-04-12T07:23:49+05:30 IST

ప్రపంచానికి గుడ్‌ఫ్రైడే సంతోషాన్నీ, ఈస్టర్‌ వారాంతపు సందడినీ కరోనా మహమ్మారి దూరం చేసింది. చర్చిలు, ప్రార్థనాలయాలు వెలవెలబోయాయి. కరోనా మరణాలు...

గడప దాటని ప్రపంచం

ఇళ్లలోనే గుడ్‌ఫ్రైడే, ఈస్టర్‌..

17.55 లక్షల పాజిటివ్‌ కేసులు..

లాక్‌డౌన్‌వైపే దేశాలు మొగ్గు


రోమ్‌, ఏప్రిల్‌ 11: ప్రపంచానికి గుడ్‌ఫ్రైడే సంతోషాన్నీ, ఈస్టర్‌ వారాంతపు సందడినీ కరోనా మహమ్మారి దూరం చేసింది. చర్చిలు, ప్రార్థనాలయాలు వెలవెలబోయాయి. కరోనా మరణాలు లక్ష దాటిపోవడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలాంటి వాతావరణంలో న్యూయార్క్‌ నుంచి న్యూఢిల్లీ దాకా, దారులన్నీ మూసుకుపోయాయి. శనివారం నాటికి ప్రపంచ మరణాలు 1,06,935కు చేరుకోగా, 17,55,319 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఇందులో 70ు విషాదాన్ని ఒక్క యూరప్‌ దేశాలే మోస్తున్నాయి. ఇక.. స్పెయిన్‌, ఇటలీలో వైరస్‌ వ్యాప్తి మందగించింది. మూడు, నాలుగు వారాలుగా లాక్‌డౌన్‌లో ఉన్న దేశాలు తొందరపడి దానిని సడలించొద్దని, మరికొన్ని వారాలు పొడిగించాలని తాజాగా డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. లేదంటే చైనాలో మాదిరిగానే తగ్గుముఖం పడుతున్నదల్లా ఒక్కసారిగా తిరగబెట్టే ప్రమాదముందని పేర్కొంది. కాగా.. 1930 నాటి ఆర్థిక మాంద్యం రోజులు పునరావృతమైనట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రకటించింది. తమ ఆర్థికవ్యవస్థలను తిరిగి నిర్మించుకోడానికి రుణాలు ఇవ్వాలంటూ దాదాపు 90 దేశాలు ఈ సంస్థను అభ్యర్థించాయి. ఇప్పటికి ప్రపంచంలో అత్యధికంగా 19,468 మరణాలు నమోదైన ఇటలీలో ఐసీయూ కేసులు తగ్గుతున్నాయి. దీంతో వచ్చేనెల మూడు వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది. వరుసగా మూడోరోజు మరణాలరేటు తగ్గిన స్పెయిన్‌లో 24  గంటల్లో 383 మంది మరణించారు.


ఫ్రాన్స్‌లో పదేళ్ల బాబు కరోనాతో చనిపోయాడు. మరణాల తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ దేశానికి ఐసీయూలో చేరేవారి సంఖ్య తగ్గడం ఊరట కలిగిస్తోంది. ఇప్పటికి ఇక్కడ 16,353 మంది చనిపోయారు. ఒక్కరోజే 917 మరణాలు నమోదయిన బ్రిటన్‌లోనూ కట్టడికే ప్రభుత్వం కట్టుబడింది. కరోనాబారిన పడి కోలుకొన్న ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆస్పత్రిలో కొంత నడవగలుగుతున్నారని, పదకేళి నింపుతున్నారని, సినిమాలను చూస్తున్నారని వైద్యులు తెలిపారు. 125 మంది మృతిలో ఇరాన్‌లో మరణాల సంఖ్య 4,357కు చేరింది. ఒకరోజే 1,837 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో పాక్షిక లాక్‌డౌన్‌కు ప్రభుత్వం ఆదేశించింది. రాత్రివేళల్లో బయటకు వచ్చేవారు త్వరగా కరోనా బారినపడుతున్నారని జపాన్‌ గుర్తించింది. వచ్చే 48 గంటలపాటు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని టర్కీ ప్రభుత్వం హుకుం జారీచేసింది. రష్యా రాజధాని మాస్కోలో మార్చి 30 నుంచి అమలవుతున్న లాక్‌డౌన్‌ను మరోవారం పొడిగించారు. రష్యాలో 12వేల కేసులు బయటపడితే, అందులో ఏడు వేలు ఒక్క మాస్కోలోనే నమోదయ్యాయి. బ్రెజిల్‌లో ఇప్పటికి వెయ్యిమంది చనిపోగా, 19,638 కేసులు బయటపడ్డాయి. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి పోలీసులకు తలనొప్పులు తెస్తున్న వారిని కనిపెట్టేందుకు దక్షిణ కొరియా కొత్త ఆలోచన చేస్తోంది. అటువంటివారి మణికట్టుకు రబ్బరుబ్యాండ్‌ వేయాలని యోచిస్తోంది. ఉరుగ్వేలోని క్రూయిజ్‌ నౌకలో చిక్కుకుపోయిన 100 మంది ఆస్ర్టేలియా, న్యూజిలాండ్‌వాసుల్లో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. టర్కీకి చెందిన 93 ఏళ్ల అలెయ్‌ గుండజ్‌ అనే బామ్మ కరోనా నుంచి కోలుకుని శనివారం డిశ్చార్జి అయ్యారు. కాగా.. సింగపూర్‌లో చిక్కుకొన్న 699 మంది భారతీయులను మనదేశం ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చింది. 250 మంది భారతీయులు కరోనా బారినపడి సింగపూర్‌ ఆస్పత్రుల్లో కోలుకొంటున్నారు. ఇండోనేసియాలో కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్యులు, సిబ్బందికి వ్యక్తిగత రక్షణ దుస్తులను (పీపీఈ) కుట్టి ఇవ్వడానికి మర్యాతీ డీముర్సీ అనే మహిళ ముందుకొచ్చారు. 20 ఆస్పత్రులకు ఆమె పీపీఈలను సమకూర్చారు.  

Updated Date - 2020-04-12T07:23:49+05:30 IST