కరోనా దెబ్బకి.. డ్రగ్స్ దొరకక, డీఅడిక్షన్ సెంటర్‌లో చేరుతున్నారు..
ABN , First Publish Date - 2020-04-08T21:08:23+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందకు విధించిన లాక్‌డౌన్ కారణంగా పంజాబ్‌లో డ్రగ్స్ దొరకకపోవడంతో ఆ భయానికి వాటికి అలవాటుపడ్డ వారు

అమృత్‌సర్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందకు విధించిన లాక్‌డౌన్ కారణంగా పంజాబ్‌లో డ్రగ్స్ దొరకకపోవడంతో ఆ భయానికి వాటికి అలవాటుపడ్డ వారు బలవంతంగా ప్రభుత్వ, ప్రైవేటు డీఅడిక్షన్ సెంటర్లలో చేరుతున్నారు. ఎయిమ్స్ నివేదిక ప్రకారం పంజాబ్‌లో దాదాపు 7.2 లక్షల మందికి డ్రగ్స్ తీసుకొనే అలవాటు ఉంది. అయితే కరోనాను అరికట్టేందకు కేంద్ర మార్చి 23వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డ్రగ్స్ లభించడం వారికి కష్టతరంగా మారింది.
దీంతో గత రెండు వారాల్లోనే రోజుకు దాదాపు వెయ్యిమందికి పైగా ట్రీట్‌మెంట్ కోసం డీఅడిక్షన్ సెంటర్లకు వస్తున్నారట. ప్రభుత నడుపుతున్న 198 ఓఓఏటీలలో, 106 ప్రైవేటు ఓఓఏటీలలో 15,754 మంది కొత్తగా చికిత్స కోసం చేరినట్లు తెలుస్తోంది. అందులో 8,901 మంది ప్రభుత్వ ఓఓఏటీలలో, 7,663 మంది ప్రైవేటు ఓఓఏటీలలో చేరారు. దీంతో డీఅడిక్షన్ కోసం చికిత్సపొందుతున్న వారి సంఖ్య 4.15లక్షలకు చేరింది.
అయితే గ్రామాల్లో డ్రగ్స్ సరఫరాను కట్టడి చేసేందుకు సర్చంచులు, డీఏపీఓల సహకారం కావాలని ఏడీజీపీ హర్‌ప్రీత్ సింగ్ సిధు కోరారు. వీలైనన్ని డీఅడిక్షన్ సెంటర్లు, ఓఓఏటీలను ఏర్పాటు చేయాలని.. తద్వారా డ్రగ్స్ వాడకానికి అడ్డుకట్ట వేయాలని ఆయన పేర్కొన్నారు. దీనిపై పంజాబ్ ఆరోగ్యశాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిధు మాట్లాడుతూ.. లాక్‌డౌన్ విధించడంతో.. డీఅడిక్షన్ చికిత్స కోసం వస్తున్న వారి సంఖ్య పెరిగిందని అన్నారు. ఇది చాలా మంచి సంకేతం అని ఆయన పేర్కొన్నారు.