అరుణాచల్‌పై డ్రా‘గన్‌’

ABN , First Publish Date - 2020-09-16T07:03:54+05:30 IST

లద్దాఖ్‌లోని రెజాంగ్‌ లా- రెచిన్‌ లా వద్ద ఎదురుదెబ్బ తిని- అక్కసుతో భారీ సేనలతో మున్ముందుకు చొచ్చుకొస్తున్న చైనా -

అరుణాచల్‌పై  డ్రా‘గన్‌’

సరిహద్దులో సైన్యం మోహరింపు

ఎల్‌ఏసీకి 20 కిమీ దూరంలో 

నాలుగు చోట్ల చైనా సేన

దీటుగా మన దళాల మోహరింపు 

 ఎల్‌ఏసీకి 20 కిమీ దూరంలో 4 చోట్ల చైనా సేన..

దీటుగా మోహరించిన భారత దళాలు


ఇటానగర్‌, సెప్టెంబరు 15: లద్దాఖ్‌లోని రెజాంగ్‌ లా- రెచిన్‌ లా వద్ద ఎదురుదెబ్బ తిని- అక్కసుతో భారీ సేనలతో మున్ముందుకు చొచ్చుకొస్తున్న చైనా -అటు తూర్పున అరుణాచల్‌ సరిహద్దుల్లో కూడా ఆకస్మికంగా పెద్ద సంఖ్యలో బలగాలను మోహరిస్తోంది. వాస్తవాధీన రేఖకు 20 కిలోమీటర్ల దూరంలో నాలుగు చోట్ల చైనా దళాలు కదులుతున్న సమాచారాన్ని నిఘా సంస్థలు తెలియజేశాయి. 


అసఫిలా, ట్యుటింగ్‌ ఏక్సిస్‌, ఛాంగ్‌ జే, ఫిష్టాలీ-2 సెక్టార్లలో పీఎల్‌ఏ దళాలు మోహరించినట్లు, వెంట అనేక సాయుధ శకటాలు కూడా తరలుతున్నట్లు తెలిపాయి. ఆ ప్రాంతాల్లో చైనా రెండేళ్ల కిందటే రోడ్లు వేసింది. ఆ రోడ్ల వెంబడే ఈ దళ సంచారం సాగుతోంది. అప్రమత్తమైన భారత సైన్యం వాస్తవాధీన రేఖ వెంట అన్ని సెక్టార్లలో తన బలగాలను రెట్టింపు చేసింది. చైనా గస్తీ దళాలు భారత బలగాలకు సమీపం దాకా వచ్చిపోతున్నట్లు తెలుస్తోంది.


భూటాన్‌లో- డోక్లాం పీఠభూమి ప్రాంతంలో- చైనా ఈ మధ్యకాలంలో భారీగా సేనలను దింపింది. యుద్ధ విన్యాసాలూ చేస్తోంది. 2017లో డోక్లాం వద్ద 73 రోజుల పాటు భారత- చైనా మధ్య తీవ్ర ప్రతిష్ఠంభన సాగిన సంగతి తెలిసిందే.


కాగా- లద్దాఖ్‌ తూర్పున ఎల్‌ఏసీ వెంబడి తాము ఫైబర్‌ ఆప్టిక్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు వచ్చిన వార్తలను చైనా తోసిపుచ్చింది. తమ దళాధికారుల మధ్య హైస్పీడ్‌ కమ్యూనికేషన్‌ నిమిత్తం పీఎల్‌ఏ దళాలు కేబుల్‌ నెట్‌వర్క్‌ను వేస్తున్నట్లు భారత సైనిక వర్గాలు రెండ్రోజుల కిందట తెలిపాయి.

దీన్ని తిరస్కరిస్తూ- భారత్‌తో కమ్యూనికేషన్‌ ఏదేనా ఉంటే అది దౌత్య, సైనిక మార్గాల్లోనే ఉంటుంది. మా కోసం మేమేమీ ఫైబర్‌ కేబుల్స్‌ వెయ్యట్లేదు’ అని చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్‌ వెబిన్‌ బీజింగ్‌లో స్పష్టం చేశారు. 


అరుణాచల్‌ యువతకు వలపు వల

అరుణాచల్‌ తమ భూభాగమని చైనా గట్టిగా వాదిస్తోంది. దాని పేరు కూడా చైనా భాషలో ‘జాంగ్‌నన్‌’ (దక్షిణ టిబెట్‌’) అని పిలుస్తోంది. అరుణాచల్‌పై భారత్‌కు గట్టి పట్టుండడంతో అక్కడ వేర్పాటు వాదాన్ని ఎగదోయడానికి చైనా విశ్వప్రయత్నం చేస్తోంది. అనేక ప్రాంతాలు అటవీమయం కావడంతో అక్కడ గిరిజనులను అపహరించి- వారిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.


ఈ క్రమంలో వారిని లొంగదీసుకునేందుకు వారిపై అందమైన అమ్మాయిలను కూడా ప్రయోగిస్తున్నట్లు సమాచారం. టిబెట్‌కు చెందిన అమ్మాయిలను బెదిరించి- తీసికెళ్లి -అరుణాచల్‌ యువతకు తారుస్తున్నట్లు తెలుస్తోంది. కొందరినైతే చైనా సరిహద్దు పట్టణాలకు తీసికెళ్లి అక్కడ ఈ పని చేయిస్తున్నట్లు మాజీ సైన్యాధికారి కల్నల్‌ వినాయక్‌ భట్‌ వెల్లడించారు. 
నన్ను చిత్రహింసలు పెట్టారు

ఓ యువకుడి కన్నీటి గాథ


కిడ్నాప్‌ చేసిన అరుణాచల్‌ యువకులను చైనా దళాలు చిత్రహింసల పాల్జేస్తున్నట్లు తాజాగా బయటపడింది. టోగ్లీ సింకమ్‌ (21) అనే యువకుడు అప్పర్‌ సుబాన్‌సిరి జిల్లాలో- దేశ సరిహద్దు గ్రామమైన టాక్సింగ్‌ వాసి.  ప్రభుత్వ, సైనిక సిబ్బందికి అవసరమైన నిత్యావసరాలు, కంబళ్లు, టెంట్లు మొదలైనవి మోస్తూంటాడు.

అతడిని ఈ ఏడాది మార్చి 19న ఎల్‌ఏసీ సమీపాన ఒంటరిగా వెళుతండడంతో పీఎల్‌ఏ దళాలు కిడ్నాప్‌ చేశాయి. అతని చేతులు విరిచికట్టి, ముఖాన్ని గుడ్డతో కప్పేసి, కొట్టుకుంటూ తీసుకుపోయాయి. కళ్లు తెరిచి చూసేసరికి  అతనో చైనా శిబిరంలో మంచానికి కట్టిపడేసి ఉన్నాడు. భారత ఆర్మీ ఆనుపానులు చెప్పమంటూ చితక్కొట్టారు. ఆ తరువాత వేరే చోటికి తీసికెళ్లి కుర్చీకి కట్టేసి కరెంట్‌ షాక్‌ ఇచ్చారు. నువ్వు భారత గూఢచారివని ఒప్పుకోమంటూ ఇష్టానుసారం బాదారు.


‘‘15 రోజులు కుర్చీకే కట్టి- ఓ చీకటి గదిలో పడేశారు. అంతేకాదు, కనురెప్ప వాలిస్తే దెబ్బలే. చాలా క్రూరంగా ప్రవర్తించారు’’ అని టోగ్లీ వాపోయాడు. ‘ఆర్మీకి చెందిన బోర్డులు రాసేది నేనేనా అని నిర్ధరించుకునేందుకు నాకు రాత పరీక్ష పెట్టారు. అలాగే ఫోన్‌ వాడాల్సిందిగా ఓ సారి నాకిచ్చారు. అదీ పరీక్షే. అయితే నేను ఆ ఉచ్చులో పడలేదు. నాకు రాదన్నాను’’ అని  టోగ్లీ చెప్పాడు.


Updated Date - 2020-09-16T07:03:54+05:30 IST