రష్యా టీకా: భారత్‌లో క్లీనికల్ ట్రయల్స్ కోసం డా. రెడ్డీస్ ల్యాబ్స్ దరఖాస్తు!

ABN , First Publish Date - 2020-10-03T21:45:14+05:30 IST

రష్యా కరోనా టీకా స్ఫూత్నిక్-వీకి సంబంధించి భారత్‌లో మూడో దశ క్లీనికల్ ట్రయల్స్ చేపట్టేందుకు అనుమతి కోసం డా. రెడ్డీస్ ల్యాబ్.. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది.

రష్యా టీకా: భారత్‌లో క్లీనికల్ ట్రయల్స్ కోసం డా. రెడ్డీస్ ల్యాబ్స్ దరఖాస్తు!

న్యూఢిల్లీ: రష్యా కరోనా టీకా స్ఫూత్నిక్-వీకి సంబంధించి భారత్‌లో మూడో దశ క్లీనికల్ ట్రయల్స్ చేపట్టేందుకు అనుమతి కోసం డా. రెడ్డీస్ ల్యాబ్స్.. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. రష్యాకు చెందిన గెమెలేయా ఇన్‌స్టిట్యూట్ స్ఫూత్నిక్-వీని తయారు చేసిన విషయం తెలిసిందే. ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కావాల్సిన అనుమతులన్నీ రష్యా ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది.


అయితే భారత్‌లో స్ఫూత్నిక్-వీకి సంబంధించిన క్లీనికల్ ట్రయల్స్, టీకా పంపిణీ చేపట్టేందుకు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డా. రెడ్డీస్ ల్యాబ్‌తో రష్యా ప్రభుత్వ పెట్టుబడుల సంస్థ(ఆర్‌డీఈఎఫ్) గతంలోనే ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలోనే..అవసరమైన అనుమతుల కోసం డీజీసీఐకి రెడ్డీస్ ల్యాబ్ తాజాగా దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.  ఫేజ్-3 క్లీనికల్ ట్రయల్స్  పూర్తి కాకమునుపే స్ఫూత్నిక్-వీని రష్యా ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.


తమ టీకా పూర్తిగా సురక్షితమైనదని  రష్యా తేల్చి చెప్పింది. అనంతరం ఈ విషయంలోనిపుణులు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పూర్తిగా సురక్షితమైన అడినోవైరస్ వెక్టర్ ఆధారంగానే తమ టీకా రూపకల్పన జరిగిందని రష్యా ప్రభుత్వం స్ఫష్టం చేసింది.


ఈ ఆరోపణల పర్వం కొనసాగుతున్న సమయంలోనే..పుతిన్ ప్రభుత్వం సెప్టెంబర్ 1న మూడో దశ క్లీనికల్ ట్రయల్స్ ప్రారంభించింది. దాదాపు 40 వేల వలంటీర్లు ఈ పరీక్షల్లో పాలుపంచుకుంటున్నారు. ఇదిలా ఉండే.. రష్యా-రెడ్డీస్ ల్యాబ్ ఒప్పందంపై అప్పట్లోనే భారత్ వైద్య పరిశోధన మండలి  డెరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ స్పందించారు.


‘మంచి టీకాలు అందించిన చరిత్ర రష్యాది. కాబట్టి ప్రస్తుత కరోనా టీకా కూడా సురక్షితమైనది భావిస్తున్నాం. టీకాకు సంబంధించి 76 రోగులపై రష్యా వారు జరిపిన అధ్యయనం ల్యాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైంది. కరోనా యాంటీబాడీల ఉత్పత్తిలో ఈ టీకా ఆశించిన ఫలితం సాధించినట్టు ఈ అధ్యయనంలో తేలింది’ అని బలరామ్ భార్గవ అప్పట్లో వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-10-03T21:45:14+05:30 IST