దాడి ఇలా జరిగింది..: కైలాస్ విజయవర్గీయ

ABN , First Publish Date - 2020-12-11T20:52:58+05:30 IST

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి ఘటనపై ఆ పార్టీ నేత కైలాస్ ..

దాడి ఇలా జరిగింది..: కైలాస్ విజయవర్గీయ

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి ఘటనపై ఆ పార్టీ నేత కైలాస్ వర్గీయ విరుచుకుపడ్డారు. ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడికి గూండాలు ఈ తరహాలో స్వాగతం చెప్పడం బెంగాల్ సంస్కృతి కాదన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బెంగాల్ ప్రజలు క్షమిస్తారని తాను అనుకోవడం లేదని చెప్పారు.


నడ్డాపైన, తమపైన జరిగిన దాడి ఘటనను ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కైలాస్ విజయవర్గీయ వివరించారు. 'నడ్డా రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా భోవనిపురి నుంచి పీపుల్స్ కాంటాక్ట్ ప్రోగ్రాంను ప్రారంభించాలనుకున్నాం. అది మమతా బెనర్జీ నియోజక వర్గం కావడంతో, టీఎంసీ కార్యకర్తలు మాకు నల్లజెండాలు చూపించే ప్రయత్నం చేశారు. మా కార్యకర్తలు అక్కడ పెద్దసంఖ్యలో ఉండటంతో వాళ్లు వెనక్కి తగ్గారు. ఆ మరుసటి రోజు డైమండ్ హార్బర్ వద్ద ప్రోగ్రాం ఉంది. ఇటీవల వచ్చిన తుపానులో దెబ్బతిన్న జాలరులు అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారికి ప్రధానికి సాయం ప్రకటించారు. అది వారికి అందలేదు. వారితో మాట్లాడాలనుకున్నాం. అయితే డైమండ్ హార్బర్ వెళ్లేందుకు అనుమతి లేదని మాకు చెప్పారు. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నియోజకవర్గం అది. ఆయన ఇద్దరు సహచరులైన షౌకత్ ముల్లా, జెహంగీర్‌లు ఆ ప్రాంతంలోని 10,000 మందికి డిన్నర్ నిర్వహించారు. మార్గమధ్యంలో మమ్మల్ని ఆపే అవకాశం ఉందని మేము చెప్పాం. దీనిపై రాత్రికి రాత్రి పశ్చిమ బెంగాల్ కార్యదర్శికి ఇ-మెయిల్ చేశాం. ఎస్పీతో మాట్లాడాం. చీఫ్ సెక్రటరీకి ఇ-మెయిల్ చేసి గవర్నర్‌కు కూడా తెలియజేశాం. ఏదైనా జరిగే అవకాశం ఉందని కేంద్రానికి కూడా తెలియజేశాం. అయితే అందరికీ ముందే చెప్పి ఉన్నందున ఎలాంటి ఘటన జరక్కపోవచ్చని అనుకున్నాం' అని కైలాస్ విజయవర్గీయ తెలిపారు. అయితే దురదృష్టవశాత్తూ తమ ప్రాణాలకు ముప్పు కలిగించే దాడి జరిగిందని చెప్పారు.


'నడ్డా కారు బుల్లెట్ ప్రూఫ్ కాబట్టి ఆయనకు ఏమీ జరగలేదు. కానీ ఆయన కారు వెనకాలే నా కారు ఉంది. వాళ్లు మా కారు అద్దాలు పగులగొట్టారు. రాహుల్ (సిన్హా), ముకుల్ (ముకుల్ రాయ్) సహా మా అందిరి కారు అద్దాలు పగిలాయి. మా డ్రైవర్లు, భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మా జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడటం ఇదే మొదటిసారి. పోలీసుల దన్నుతో గూండాలు దాడులకు దిగడం మేము ఎన్నడూ చూడలేదు. ఒక పార్టీ చీఫ్‌కు ఇలాంటి ఆహ్వానం పలకడం బెంగాల్ సంస్కృతి ఎంతమాత్రం కాదు. జరిగిన ఘటన రాష్ట్రానికే కాకుండా, దేశానికే చెడ్డపేరు తెచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బెంగాల్ ప్రజలు క్షమిస్తారని నేను అనుకోవడం లేదు' అని కైలాస్ విజయవర్గీయ అన్నారు.

Updated Date - 2020-12-11T20:52:58+05:30 IST