ప్రపంచ ఆరోగ్య సంస్థకు ట్రంప్ వార్నింగ్!
ABN , First Publish Date - 2020-04-08T19:17:22+05:30 IST
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు అమెరికా సమకూర్చే నిధుల్లో భారీగా కోత విధిస్తామని ట్రంప్ తాజా హెచ్చరించారు.

వాషింగ్టన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు అమెరికా సమకూర్చే నిధుల్లో భారీగా కోత విధించే అంశాన్ని పరిశీలిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఆయన డబ్ల్యూహెచ్ఓపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల జరిగిన పత్రికా సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘డబ్ల్యూహెచ్‌ఓపై వెచ్చిస్తున్న నిధులకు మేం బ్రేకులు వేస్తాం. నిధులను నిలివేయాలా వద్దా అనే అంశాన్ని పరిశిలిస్తాం. డబ్ల్యూహెచ్ఓ..చైనా పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తోంది’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
అంతేకాకుండా.. అమెరికాకు డబ్ల్యూహెచ్ఓ తప్పుడు సలహా ఇచ్చిందని కూడా ఆరోపించారు. చైనానుంచి కరోనా వ్యాప్తి ప్రారంభమైన సమయంలో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం విధించాల్సిన అవసరం లేదని డబ్ల్యూహెచ్ఓ అమెరికాకు సూచించడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘అదృష్టవశాత్తూ నేను ఆ సలహాను అప్పుడే పక్కన పెట్టేశా’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. కాగా.. గతంలో పలు సార్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ఇతర వ్యవస్థలపై మండిపడ్డ ట్రంప్.. కరోనా కలకలం నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థను టార్గెట్ చేస్తున్నారు. అయితే కరోనా సంక్షోభం విషయంలో డబ్ల్యూహెచ్ఓ అనుసరించిన వైఖరిపై ఇతర దేశాలు కూడా అభ్యంతరాలు లేవనెత్తాయి.