గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందా?

ABN , First Publish Date - 2020-09-29T07:35:40+05:30 IST

కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందా? ఒక వేళ అలా వ్యాప్తి చెందితే వైరస్‌ సోకిన వ్యక్తి నుంచి ఎంత దూరం వరకు దాని ప్రభావం ఉం టుందనే అంశాలపై.. హైదరాబాద్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ(సీసీఎంబీ) అధ్యయనం చేపట్టింది...

గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందా?

  • సరికొత్త అధ్యయనం చేపట్టిన సీసీఎంబీ
  • ఆస్పత్రుల్లో గాలి నమూనాల సేకరణ

కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందా? ఒక వేళ అలా వ్యాప్తి చెందితే వైరస్‌ సోకిన వ్యక్తి నుంచి ఎంత దూరం వరకు దాని ప్రభావం ఉం టుందనే అంశాలపై.. హైదరాబాద్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ(సీసీఎంబీ) అధ్యయనం చేపట్టింది. పాజిటివ్‌ వచ్చిన వారు  సంచరించిన ప్రాంతాల్లో ఆ వైరస్‌ వ్యాపించి ఉంటుందనే భయం చాలామందిలో ఆందోళన రేకెత్తిస్తోంది. ముఖ్యంగా.. ఆస్పత్రులు, కొవిడ్‌ చికిత్సా కేంద్రాల్లోని వార్డులు, అత్యవసరవైద్య విభాగాల్లో వైరస్‌ వ్యాప్తిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


ఈ నేపథ్యంలోనే సీసీఎంబీ ఈ అధ్యయనాన్ని చేపట్టింది. ఆరోగ్య సిబ్బంది సంక్షేమంతో పాటు.. కరోనా వ్యాప్తిని నిరోధించే విషయంలో భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే అంశాలపై ఒక అవగాహనకు రావడానికి తమ అధ్యయనం తోడ్పడుతుందని సీసీఎంబీ సంచాలకుడు డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. మాస్కులను ధరించడం, భౌతిక దూరం వంటి అంశాల్లో ఈ అధ్యయనం ఆధారంగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కాగా.. పది రోజుల క్రితం ఈ అధ్యయనాన్ని ప్రారంభించామని, ఆస్పత్రులలోని కరోనా వార్డులు అత్యవసర విభాగాల్లో గాలి నమూనాల(ఎయిర్‌ శాంప్లర్స్‌)ను సేకరిస్తున్నామని రాకేశ్‌ మిశ్రా వివరించారు. వైరస్‌ సోకిన రోగికి రెండు, నాలుగు, ఎనిమిది మీటర్ల దూరాల నుంచి గాలి నమూనాలను సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. తొలుత ఆస్పత్రులలో అధ్యయనం చేపడతామని, వైరస్‌ రెండు లేదా మూడు మీటర్ల దూరం వ్యాపిస్తుందని నిర్ధారణ అయితే.. బ్యాంకులు, జనసంచారం అధికంగా ఉండే ఇతర ప్రాంతాల్లో కూడా అధ్యయనం చేపడతామని రాకేశ్‌ మిశ్రా తె లిపారు.



ఎప్పట్నుంచో ఆందోళన..

కరోనా వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని 200 మంది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు రెండు నెలల క్రితమే నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. నియంత్రిత వాతావరణంలో కరోనా వైరస్‌ అలా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆ తర్వాత అంగీకరించింది. ఈ క్రమంలో సీసీఎంబీ చేపట్టిన అధ్యయనానికి ఎంతో ప్రాధాన్యం ఉందని, ఎక్కువ మంది సంచరించే సినిమాహాళ్ల వంటి ప్రదేశాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే నియమావళి రూపొందించుకునేందుకు ఈ అధ్యయనం తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

-స్పెషల్‌ డెస్క్‌


Updated Date - 2020-09-29T07:35:40+05:30 IST