పేషంట్ల కోసం పెళ్లి వాయిదా

ABN , First Publish Date - 2020-04-01T06:03:39+05:30 IST

కరోనా మహమ్మారిపై సాగిస్తున్న పోరులో ఎన్నో త్యాగాలు, స్ఫూర్తినిచ్చే సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి డాక్టర్‌ షిఫా ఎం. మహమ్మద్‌ కథ. కేరళకు చెందిన...

పేషంట్ల కోసం పెళ్లి వాయిదా

కేరళ డాక్టర్‌ ఆదర్శం


తిరువనంతపురం, మార్చి 31: కరోనా మహమ్మారిపై సాగిస్తున్న పోరులో ఎన్నో త్యాగాలు, స్ఫూర్తినిచ్చే సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి డాక్టర్‌ షిఫా ఎం. మహమ్మద్‌ కథ. కేరళకు చెందిన 23 ఏళ్ల షిఫా ఆ రాష్ట్రంలోని పరియారం మెడికల్‌ కాలేజీలో హౌస్‌ సర్జన్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆమె వివాహం మార్చి 29న దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త అనుస్‌ మహమ్మద్‌తో జరగాల్సి ఉంది. అయితే యావత్తు కేరళ రాష్ట్రం కరోనాపై యుద్ధం చేస్తున్న సమయంలో వ్యక్తిగత సంబరాల కంటే సామాజిక బాధ్యతకే మొదటి ప్రాధాన్యం ఇస్తూ వివాహాన్ని వాయిదా వేయించింది. ప్రతీ మహిళ జీవితంలో వివాహం అత్యంత సంతోషకరమైన సందర్భం. అయితే చుట్టూ ఉన్న మనుషులు కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్న తరుణంలో పెళ్లి కంటే డాక్టర్‌గా నిర్వర్తించాల్సిన బాధ్యత విలువైందిగా భావించింది షిఫా. కావాలంటే వివాహం కోసం కొన్ని రోజులు వేచి ఉండొచ్చు. కానీ ఐసోలేషన్‌ వార్డులో ప్రాణాలతో పోరాడుతున్న రోగుల కోసం సమయం మాత్రం ఆగదని భావించి వరుడు అనుస్‌ మహమ్మద్‌, అతని తల్లిదండ్రులను ఒప్పించింది.


షిఫా తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని వారుకూడా అంతే పెద్ద మనసుతో అంగీకరించారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడటానికి షిఫా అంత ఆసక్తి చూపలేదు. నేను చేసింది అంత గొప్ప విషయం కాదు. సమాజం పట్ల నా బాధ్యతను మాత్రమే నిర్వర్తించాను అని వినమ్రంగా షిఫా వ్యాఖ్యానించింది. పెళ్లి రోజున (మార్చి 29) కూడా నేను విధుల్లో ఉన్నా. ఐసోలేషన్‌ వార్డుల్లో రోగులకు సేవలందించేకు వీలుగా ప్రొటెక్టివ్‌ ఎక్వి్‌పమెంట్‌ను ధరించి ఉన్నాను. దాన్ని చూసి నా స్నేహితులు ఇదే నీకు బెస్ట్‌ డ్రెస్‌ అంటూ టీజ్‌ కూడా చేశారు. ఎల్లప్పుడు రోగులకు సేవ చేయడంలోనే నేను ఆనందాన్ని వెతుక్కుంటాను అంటూ తన సహృదయతను చాటుకుంది షిఫా. వివాహం వాయిదా విషయాన్ని షిఫా తల్లిదండ్రుల వద్ద ప్రస్తావించినప్పుడు వారు కూడా అడ్డుచెప్పకుండా తమ కుమార్తె తీసుకున్న నిర్ణయానికి సంతోషంగా సమ్మతి తెలిపారు. వ్యక్తిగత విషయాల కంటే సామాజిక బాధ్యతకు, వృత్తిపరమైన నిబద్ధతకు తమ కుమార్తె ఇస్తున్న ప్రాధాన్యం చూస్తే తమకు గర్వంగా ఉందని షిఫా తండ్రి ముక్కం మహమ్మద్‌ అన్నారు. ముక్కం కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. తండ్రిలోని ఈ గుణాన్ని చూస్తూ పెరిగిన షిఫాలో కూడా సమాజానికి ఏదైనా చేయాలనే కాంక్ష చిన్నప్పటి నుంచి బలంగా నాటుకుంది. షిఫా అక్క సైతం డాక్టర్‌గా కోజికోడ్‌ మెడికల్‌ కాలేజీలో విధులు నిర్వహిస్తోంది.

Updated Date - 2020-04-01T06:03:39+05:30 IST