రాజ్యసభ సభ్యులను చిన్న చూపు చూడొద్దు : ఆనంద్ శర్మ

ABN , First Publish Date - 2020-11-25T17:16:50+05:30 IST

కాంగ్రెస్‌ అధిష్ఠానానికి 23 మంది ఆగస్టులో రాసిన లేఖ సృష్టించిన ప్రకంపనలు

రాజ్యసభ సభ్యులను చిన్న చూపు చూడొద్దు : ఆనంద్ శర్మ

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధిష్ఠానానికి 23 మంది ఆగస్టులో రాసిన లేఖ సృష్టించిన ప్రకంపనలు కొనసాగుతున్నాయి. బిహార్ శాసన సభ ఎన్నికల్లో పార్టీ పనితీరు పట్ల కపిల్ సిబాల్, గులాం నబీ ఆజాద్ వంటివారు తీవ్రంగా స్పందించడంతో వీరిపై అధిర్ రంజన్ చౌదరి వంటివారు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ మరొక సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఆనంద్ శర్మ ఓ హెచ్చరిక చేశారు. రాజ్యసభ సభ్యులను చిన్నచూపు చూడవద్దని చెప్పారు. 


ఆగస్టులో కాంగ్రెస్ అధిష్ఠానానికి లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతలలో ఆనంద్ శర్మ కూడా ఉన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేతలపై సొంత పార్టీ నేతలు విమర్శలు చేస్తుండటంతో ఆనంద్ శర్మ స్పందించారు. వీరంతా ఎవరిని చిన్న చూపు చూస్తున్నారని ప్రశ్నించారు. భారత దేశంలోని గొప్ప నాయకులు ఏదో ఒక సమయంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న విషయం వీరికి తెలుసా? అని అడిగారు. ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పాయి, సోమనాథ్ ఛటర్జీ, ఎల్‌కే అద్వానీ రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారన్నారు. 


ఇదిలావుండగా, ఇటీవల కాంగ్రెస్ అధికారికంగా తన పార్టీ నేతలకు ఓ సూచన చేసింది. నామినేటెడ్ రాజ్యసభ సభ్యులు పార్టీ క్రమశిక్షణకు అనుగుణంగా నడచుకోవాలని కోరింది. అంతర్గత వ్యవహారాలపై గీత దాటి మాట్లాడవద్దని తెలిపింది. 


కాంగ్రెస్ ఆత్మావలోకనం చేసుకోవాలని చెప్తున్న సీనియర్లపై కొందరు కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఫైవ్ స్టార్ కల్చర్‌లో మగ్గిపోతోందని రాజ్యసభ సభ్యులు ఏవిధంగా చెప్తున్నారని ప్రశ్నిస్తున్నారు. రాజ్యసభ సభ్యులుగా ఆనందంగా జీవితాలు గడుపుతూ, పార్టీ మళ్ళీ డ్రాయింగ్ బోర్డు దగ్గరికి వెళ్ళాలని ఎలా చెబుతారని నిలదీస్తున్నారు. దీంతో రాజ్యసభ సభ్యుడైన ఆనంద్ శర్మ స్పందించారు. 


మన దేశ రాజ్యాంగ రూపకర్తలు రెండు చట్ట సభలు ఉండాలని నిర్ణయించారని ఆనంద్ శర్మ తెలిపారు. రాజ్యాంగ కమిటీ చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, గోపాలకృష్ణ అయ్యంగార్ వంటివారు చెప్పిన విషయాలను గుర్తు చేసుకోవాలన్నారు. భారత దేశం  ఓ యూనియన్ అని, రాష్ట్రాలకు రాజ్యసభ ప్రాతినిథ్యం వహిస్తుందని వారు చెప్పారన్నారు. రాజ్యసభ సభ్యులంతా ఎన్నికైనవారేనని తెలిపారు. మాజీ ప్రధాన మంత్రులు, మంత్రులు కూడా ఎన్నికైనవారేనని, నామినేట్ అయినవారు కాదని చెప్పారు. పార్లమెంటులో మొదటి సభ రాజ్యసభేనని చెప్పారు. మనది రాష్ట్రాల యూనియన్ కావడమే దీనికి కారణమని తెలిపారు. ముఖ్యమైన బిల్లులను మొదట రాజ్యసభలోనే ప్రవేశపెడతారన్నారు. 


Updated Date - 2020-11-25T17:16:50+05:30 IST