అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమిళనాట పెనుమార్పులు

ABN , First Publish Date - 2020-12-27T17:28:44+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయని

అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమిళనాట పెనుమార్పులు

చెన్నై : అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. సీపీఐ సీని యర్‌ నేత నల్లకన్ను జన్మదిన వేడుకలు టి.నగర్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం నిరాడంబరంగా జరిగాయి. ఈ వేడుకల్లో స్టాలిన్‌ పాల్గొని నల్లకన్నును శాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో స్టాలిన్‌ ప్రసంగిస్తూ... సీపీఐ వృద్ధనేత నల్లకన్నును గురించి చెప్పాలంటే అన్ని పార్టీలకు చెందిన నాయకులందరికీ ఆయన ఆదర్శ పురుషుడని పేర్కొంటే అతిశయోక్తి కాదన్నారు. దివంగత సీఎం, డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి ఓ సందర్భంలో నల్లకన్ను గురించి చెబుతూ... వయస్సు రీత్యా తన కంటే పిన్నవాడైనప్పటికీ ప్రజాసేవలో తనకంటే అనుభవం ఎక్కువగా కలిగిన ఆదర్శ నాయకుడంటూ కితాబిచ్చారని స్టాలిన్‌ గుర్తు చేశారు.


అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామసభలకు అనుమతి కోరితే అన్నాడీఎంకే ప్రభుత్వం నిరాకరిస్తోందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో జరిగినట్లు డీఎంకే గ్రామసభలు జరిపితే తమ పార్టీ ఓడిపోతుందని అన్నాడీఎంకే నేతలు భయపడుతుండటం వల్లే అనుమతి నిరా కరిస్తున్నారని ఆరోపించారు.  ఈనెల 23 నుంచి తాను పలు గ్రామసభలలో పాల్గొంటున్నానని, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి వారి సమస్యలను మొరపెట్టుకుంటున్నారని చెప్పా రు. తన గ్రామసభలకు మునుపటికంటే అధికంగా జనం వస్తుండటాన్ని చూసి అన్నాడీఎంకే పాలకులకు వణుకుపుడుతోందన్నారు. ప్రతి గ్రామసభ ప్రశాంతంగా జరుగుతోందని, ఎక్కడా  అవాంఛనీయ సంఘటనలు జరుగలేదన్నారు.


గ్రామసభలు విజయవంతమైతే డీఎంకే కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తుందన్న భయంతోనే ప్రభుత్వం రెండు రోజుల ముందు  సభలకు అనుమంతించబోమంటూ ప్రకటించిందని స్టాలిన్‌ అన్నారు. సీసీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్‌ మాట్లాడుతూ... రాష్ట్రంలో మార్పు తీసుకురావడానికి డీఎంకే కూటమి తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. ఈ సభలో డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌, వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి, సీపీఐ నాయకులు ముత్తరసన్‌, టి. పాండ్యన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T17:28:44+05:30 IST