కాంగ్రెస్‌ కర్ణాటక అధ్యక్షుడిగా డీకే

ABN , First Publish Date - 2020-03-12T07:40:58+05:30 IST

కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(కేపీసీసీ) అధ్యక్షుడిగా డీకే శివకుమార్‌ను నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల అసెంబ్లీ ఉప ఎన్నికలు...

కాంగ్రెస్‌ కర్ణాటక అధ్యక్షుడిగా డీకే

బెంగళూరు, మార్చి 11(ఆంధ్రజ్యోతి): కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(కేపీసీసీ) అధ్యక్షుడిగా డీకే శివకుమార్‌ను నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల అసెంబ్లీ ఉప ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేపీసీసీ అధ్యక్ష పదవికి దినేశ్‌ గుండూరావు రాజీనామా చేసినప్పటి నుంచి ఆ పద వి ఖాళీగా ఉంది. 2 నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఆ నియామకాన్ని ఇప్పుడు పూర్తి చేశారు.


డీకే శివకుమార్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షనేత సిద్దరామయ్య చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాగా, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న ఈశ్వర్‌ఖండ్రేను యథావిధిగా కొనసాగించడంతోపాటు మరో ఇద్దరిని(సతీశ్‌ జార్ఖిహొళి, సలీం అహ్మద్‌) కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించారు. దీంతో ముగ్గురు కార్యనిర్వాహక అధ్యక్షులు అయ్యారు. అలాగే శాసనసభలో చీఫ్‌ విప్‌గా అజయ్‌సింగ్‌ను నియమించారు. అజయ్‌సింగ్‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్‌.ధరమ్‌సింగ్‌ కుమారుడు. శాసన మండలిలో చీఫ్‌ విప్‌గా ఎం.నారాయణస్వామిని నియమించారు. సీఎల్పీ నేతగా, అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా సిద్దరామయ్య కొనసాగుతారని ఏఐసీసీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. డీకేను సిద్దరామయ్య, సీనియర్‌ నేతలు హెచ్‌కే పాటిల్‌ తదితరులు సభలోనే అభినందించారు.

Updated Date - 2020-03-12T07:40:58+05:30 IST