కరోనాను మించిన కరోడాలు!

ABN , First Publish Date - 2020-04-26T06:05:58+05:30 IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కట్టడికి త్వరలో మందులు, టీకాలు వస్తాయా.. రాకపోతే మనుషుల పరిస్థితి ఏంటి.. అన్న ఆలోచనలు ఎంతో మందిలో ఉన్నాయి. మరి ఇంతకుముందు ఇలాంటి మహమ్మారులు రాలేదా...

కరోనాను మించిన కరోడాలు!

ఇంతకుముందూ అనేక మహమ్మారులు.. కొవిడ్‌-19తో పోల్చితే వాటి మరణాల రేటే ఎక్కువ ఎన్నో వైర్‌సలపై మానవాళి విజయం


ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కట్టడికి త్వరలో మందులు, టీకాలు వస్తాయా.. రాకపోతే మనుషుల పరిస్థితి ఏంటి.. అన్న ఆలోచనలు ఎంతో మందిలో ఉన్నాయి. మరి ఇంతకుముందు ఇలాంటి మహమ్మారులు రాలేదా.. అంటే చాలానే వచ్చాయి. 1918లో వచ్చిన స్పానిష్‌ ఫ్లూ కోట్ల మందిని బలిగొంది. మరికొన్ని వైర్‌సల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఇంకొన్ని వైర్‌సలను మానవ రోగ నిరోధక వ్యవస్థ తట్టుకుంది. కొన్నింటికి టీకాలు కనుగొన్నారు. మరికొన్ని ఉనికిలోనే ఉన్నప్పటికీ వివిధ చికిత్సా విధానాల ద్వారా వాటిని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ప్ర పంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా కూడా వీటి జాబితాలోనే చేరనుంది. దీనికి మందు కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు, వైద్యులు తీవ్ర కృషి చేస్తున్నారు. ప్రస్తు తం కరోనా వైరస్‌ మోర్టాలిటీ రేటు(వ్యాధి సోకిన వారిలో చనిపోయే వారి సంఖ్య) మిగతా వైర్‌సలతో పోల్చితే చాలా తక్కువ. వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ మరణించే వారిసంఖ్య తక్కువగా(2ు-3ు) ఉంటోంది. అదీ ఇతర ఆరోగ్య సమస్యలున్న వారిలోనే మరణాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంతకు ముందు వచ్చిన కొన్ని వైర్‌సలు ఎలా ప్రభావం చూపించాయో పరిశీలిద్దాం.


ఎబోలా

ఎబోలాను మొట్టమొదటిసారి డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో గుర్తించారు. 2014-16 మధ్య పశ్చిమ ఆఫ్రికాలో వేగంగా  విస్తరించిన ఈ వైరస్‌ 28,610 మందికి సోకగా అందులో 11,308 మందిని బలి తీసుకుంది. 2018లో 3,432 మందికి వైరస్‌ సోకగా 2,249 మంది చనిపోయారు. వైరస్‌ సోకినవారిలో దాదాపు సగం మంది చనిపోయారు. దీనికి కూడా టీకా లేదు. 


మెర్స్‌..

మెర్స్‌ అంటే మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌. ఈ వ్యాధి కూడా ఒక రకమైన కరోనా వైరస్‌ వల్ల వస్తుం ది. ప్రస్తుతం కొవిడ్‌కు కారణమైన కరోనాతో పోల్చితే ఇది చాలా ప్రమాదకరమైంది. అరుదుగా వ్యాపించే ఈ వైరస్‌ తీవ్రత సౌదీ అరేబియాలో ఎక్కువ. 2012లో దీనిని గుర్తించారు. అప్పుడు 2,499 మందికి వైరస్‌ సోకితే అందులో 861 మంది చనిపోయారు. దీనికి కూడా ఎలాంటి టీకా లేదు.

ఇన్‌ఫ్లూయెంజా..

ఇన్‌ఫ్లూయెంజా వైర్‌సలు ఎప్పటికప్పుడు రూపుమార్చుకుంటూ గత రెండు దశాబ్దాల్లో సృష్టించిన అలజడి అంతాఇంతా కాదు. స్వైన్‌ ఫ్లూ మహమ్మారి ప్రజలను పట్టిపీడించిన ఘట్టాలు చాలామందికి గుర్తుండే ఉంటాయి. ఇది కూడా ఓ రకం ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ వల్లే వ్యాపిస్తుంది. వివిధ రకాల ఫ్లూ జ్వరాల బారినపడి ప్రతీ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది చనిపోతున్నారు. వివిధ వ్యాక్సిన్లతో దాని కట్టడికి విశేష కృషి జరుగుతోంది. ఫలితంగా ఫ్లూ జ్వరాలతో మరణించే వారి సంఖ్య బాగా తగ్గింది. 


హెపటైటిస్‌..

హెపటైటిస్‌ వైర్‌సలలో ఏ,బీ,సీ,డీ,ఈ అనే రకాలు ఉన్నాయి. ఈ వైరస్‌  2015 సంవత్సరంలో 13 లక్షల మందికి  పైగా బలి తీసుకుంది. ఏటా లక్షల సంఖ్యలో హెపటైటిస్‌ సీ కేసులు నమోదవుతున్నాయి. ఇందులో 96 శాతం మరణాలు హెపటైటిస్‌ బీ, సీ వల్లే సంభవిస్తున్నాయి. హెపటైటిస్‌ సీ సోకిన వారిలో కనీసం 20శాతం మంది కూడా చికిత్స పొందలేక కాలేయ సంబంధిత వ్యాధితో చనిపోతున్నారు. 


హెచ్‌ఐవీ.. 

హెచ్‌ఐవీని గుర్తించిన తొలినాళ్లలో కొన్ని కోట్ల మంది చనిపోయారు. ఇప్పుడూ ఏటా లక్షల్లో  కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ వాటిని పలు చికిత్సా విధానాలతో ఎదుర్కొంటున్నాం. పలు ఔషధాలు, ప్రణాళికాబద్ధమైన ఆరోగ్య విధానాల ద్వారా ఎయిడ్స్‌ రోగుల జీవితకాలాన్ని పెంచగలుగుతున్నాం. ఐదు మహమ్మారి వైర్‌సల తీవ్రతను, అవి కనుమరుగైన తీరును గమనిస్తే త్వరలోనే మనం కరోనా నుంచీ విముక్తులమవుతామనే ఆశాభావం కలుగకమానదు.  


- సెంట్రల్‌ డెస్క్‌



Updated Date - 2020-04-26T06:05:58+05:30 IST