బిజినెస్ క్లాస్ సీట్ ఇచ్చేసిన ధోనీ.. సీఎస్‌కే డైరెక్టర్ షాక్!

ABN , First Publish Date - 2020-08-23T00:04:22+05:30 IST

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్‌ ధోని ఎప్పుడూ తనకంటే ముందు తన..

బిజినెస్ క్లాస్ సీట్ ఇచ్చేసిన ధోనీ.. సీఎస్‌కే డైరెక్టర్ షాక్!

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్‌ ధోని ఎప్పుడూ తనకంటే తన జట్టు ప్రయోజనాలు, సౌకర్యానికే ప్రాధాన్యత ఇస్తాడని పేరుంది. ఎదుటివారితో దయ కలిగి వ్యవహరించడం, ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం కారణంగా అతడు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. త్వరలో జరిగే ఐపీఎల్-2020 కోసం సీఎస్‌కే జట్టు శుక్రవారం యూఏఈ బయల్దేరిన సందర్భంగా.. ఈ జార్ఖండ్ డైనమైట్ మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నాడు. ధోనీ తన కోసం బిజినెస్ క్లాస్ సీటు వదిలేసి వెళ్లి ఎకానమీలో కూర్చున్నట్టు సీఎస్‌కే డైరెక్టర్ జార్జ్ జాన్ ట్విటర్లో వెల్లడించారు.


జార్జ్ కాళ్లు పొడుగ్గా ఉండడంతో ఆయన ఎకానమీ క్లాస్ సీట్లో కూర్చునేందుకు కొంత ఇబ్బంది పడ్డారు. దీన్ని గమనించిన ధోనీ.. తన సీటు ఆయనకు ఇచ్చేశాడు. ‘‘క్రికెట్‌లో తనకు తిరుగులేదని నిరూపించుకున్న ఓ వ్యక్తి ఏమన్నాడంటే... ‘మీ కాళ్లు చాలా పొడుగ్గా ఉన్నాయి. రండి.. నా సీట్లో కూర్చొండి. నేను ఎకానమీలో కూర్చుంటాను..’’ అని అన్నాడు. కెప్టెన్‌ని చూసి ఎప్పుడూ సంభ్రమాశ్చర్యాలకు గురౌతూ ఉంటాను..’’ అని జార్జ్ పేర్కొన్నారు. గతంలో కూడా ధోనీ బిజినెస్ క్లాసులో వెళ్లేందుకు అంతగా ఇష్టపడేవాడు కాదని ప్రముఖ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు. తనకు బిజినెస్ క్లాసు సీటు ఉన్నా ఎకానమీలో కూర్చుని అందరితో ముచ్చట పెట్టుకునేందుకే అతడు ఇష్టపడేవాడనీ ఆయన పేర్కొన్నారు. 



Updated Date - 2020-08-23T00:04:22+05:30 IST