ఉన్నట్టుండి హఠాత్తుగా తెరపైకి వచ్చిన దేవేంద్ర ఫడణ్‌వీస్

ABN , First Publish Date - 2020-08-16T21:06:07+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పజెప్పింది. రాబోయే

ఉన్నట్టుండి హఠాత్తుగా తెరపైకి వచ్చిన దేవేంద్ర ఫడణ్‌వీస్

ముంబై : మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పజెప్పింది. రాబోయే బిహార్ ఎన్నికలకు ఇన్‌చార్జీగా నియమించనున్నట్లు సమాచారం. అయితే... ఈ విషయాన్ని బీజేపీ అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ... బిహార్ ఎన్నికలపై జరిగిన వర్చువల్ కోర్ కమిటీ సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. అంతేకాకుండా ఇకపై జరగబోయే అన్ని కీలక సమావేశాల్లోనూ ఫడ్నవీస్ పాల్గొంటారని సమాచారం.


మహారాష్ట్రలో సంకీర్ణ రాజకీయాలే నడిచాయి. చివరి దశలో... శివసేనతో డీల్ కాస్త చెడింది. బిహార్‌లో కూడా సంకీర్ణ రాజకీయాలే. నితీశ్ సారథ్యంలోని జేడీయూతో బీజేపీ పొత్తు నడుస్తోంది. బీజేపీ అగ్రనేత సుశీల్ మోదీ అక్కడ ఉప ముఖ్యమంత్రి. మహారాష్ట్రలో సంకీర్ణాన్ని డీల్ చేయడంలో ఇబ్బందిపడ్డ బీజేపీ... బిహార్ లో మాత్రం ఇబ్బంది పడకుండా... సంకీర్నాన్ని పక్కగా నడిపేందుకు ప్లాన్ వేసింది. ఇప్పటి వరకైతే నితీశ్‌తో సయోధ్య బాగానే ఉంది. ఎన్నికల తర్వాత ఏమైనా ఇబ్బందులు వస్తే డీల్ చేయడానికి ఫడణ్‌వీస్‌ను తెరపైకి తెచ్చారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


సంకీర్ణాన్ని డీల్ చేయడంలో అనుభవమున్న మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అనుభవాన్ని బిహార్‌లో వాడుకోవాలని అధిష్ఠానం ఆలోచన అని కొందరు పేర్కొన్నారు. అంతేకాకుండా నటుడు సుశాంత్ మృతి విషయంలో కూడా బిహార్, మహారాష్ట్ర మధ్య యుద్ధం నడుస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఫడ్నవీస్‌కు బిహార్ బాధ్యతలు అప్పజెప్పినట్లు తెలుస్తోంది.


రాబోయే బిహార్ ఎన్నికల్లో ఫడణ్‌వీస్ కచ్చితంగా కీలక పాత్ర పోషించబోతున్నారని బీజేపీ వర్గాలు కూడా అనధికారికంగా ధ్రువీకరిస్తున్నాయి. బిహర్‌ ఎన్నికలకు సంబంధించిన ప్రతి ముఖ్యమైన అంశాన్ని కూడా ఫడణ్‌వీస్ దృష్టికి తీసుకెళ్లాలని కేంద్ర నాయకత్వం ఇప్పటికే రాష్ట్ర నాయకులకు తేల్చి చెప్పింది. ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని ఇటు ఫడణ్‌వీస్ కు కూడా అధిష్ఠానం సూచించింది. 

గతంలో ప్రమోద్ మహజన్... ఇప్పుడు దేవేంద్ర ఫడణ్‌వీస్

బిహార్ ఎన్నికల ఇన్‌చార్జీగా దేవేంద్ర ఫడణ్‌వీస్‌ నియామకం దాదాపు ఖాయమైంది. అంటే... జాతీయ రాజకీయాల్లోకి దేవేంద్ర ఫడణ్‌వీస్ ఆగమనం కూడా ప్రారంభమైనట్లేనని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే ఈ నియామకమని కొందరు గట్టిగా భావిస్తున్నారు. ఫడణ్‌వీస్‌తో పోలిస్తే... ఇద్దరు యువ నేతలు మహారాష్ట్ర నుంచి జాతీయ రాజకీయాల్లోకి వచ్చినట్లు లెక్క.


యువ నాయకురాలు పంకజా ముండే కూడా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని రాష్ట్ర శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఇక... దేవేంద్ర ఫడణ్‌వీస్ కూడా బిహార్ రాజకీయాల ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వచ్చేసినట్లేనని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. ఇలా మహారాష్ట్ర నేతలను జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా... వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీ మహారాష్ట్రను టార్గెట్ చేసిందని... మహారాష్ట్ర వేదికగా కీలక పాత్ర పోషించాలని అధిష్ఠానం ఆలోచన అని సమాచారం. 


మరోవైపు సంకీర్న రాజీయాలను నెరపడం మహారాష్ట్ర నేతలకు కొత్తేమీ కాదు. గతంలో అటల్ బిహారీ వాజ్‌పాయ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం నడిచిన విషయం తెలిసిందే. ఇందులో వెనకుండి భాగస్వామ్య పక్షాలను డీల్ చేసింది దివంగత ప్రమోద్ మహాజన్ అని అందరికీ తెలిసిందే.


వాజ్‌పాయ్ హయాంలో ప్రమోద్ మహాజన్ నెరిపిన రాజకీయ చాణక్యం అంతా ఇంతా కాదు. సంకీర్ణ భాగస్వామ్య పక్షాలతో పాటు... ప్రతిపక్ష నేతలతోనూ మహాజన్‌కు సన్నిహిత సంబంధాలే ఉండేవి. అలా.. మహారాష్ట్ర నేతలు సంకీర్ణ రాజకీయాలు నెరపడంలో సిద్ధహస్తులని బీజేపీ అగ్రనేతల టాక్.


Updated Date - 2020-08-16T21:06:07+05:30 IST