విభిన్నంగా దసరా పండుగ.. ప్రత్యేకత ఇదే?

ABN , First Publish Date - 2020-10-25T01:41:34+05:30 IST

చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా దసరా జరుపుకుంటారని హిందూ పురాణాలు చెబుతున్నాయి. మరి.. ఏ రాష్ట్రంలో ఎలా ఈ పండుగను నిర్వహిస్తారు?...

విభిన్నంగా దసరా పండుగ.. ప్రత్యేకత ఇదే?

చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా దసరా జరుపుకుంటారని హిందూ పురాణాలు చెబుతున్నాయి. మరి.. ఏ రాష్ట్రంలో ఎలా ఈ పండుగను నిర్వహిస్తారు? ఎవరు ఎలా తమ ప్రత్యేకతను చాటుకుంటారు? వివిధ రాష్ట్రాల్లో విభిన్నంగా చేసుకునే దసరా విశేషాలు చూద్దాం...


యావద్భారత దేశంలో అత్యంత ప్రభావవంతంగా, అతి పవిత్రంగా నిర్వహించుకునే విజయ దశమి పర్వదినాన్ని పలు ప్రాంతాలలో పలు విధాలుగా నిర్వహించుకుంటారు. దేవీ పూజకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే ఈ పండుగను దేశమంతటా జరుపుకుంటారు. ఉత్తర, దక్షిణ భారతదేశంతో పాటు.. ఈశాన్యభారతంలోనూ ఈ వేడుకను కన్నుల పండువగా నిర్వహిస్తారు. మైసూరు, కలకత్తా, సిమ్లా తదితర ప్రాంతాలలో అక్కడి ప్రాంతీయ విశ్వాసాలతో దసరా పండుగను చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.


దక్షిణాదిలో దసరా వేడుకలు అనగానే మైసూరు ఉత్సవాలు గుర్తొస్తాయి. అక్కడ నదహబ్బ పేరిట దసరా ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇది కర్నాటకలో రాష్ట్రపండుగగా జరుపుకుంటారు. నవరాత్రి వేడుకలను విజయ దశమితో కలిపి పది రోజుల పాటు నిర్వహిస్తారు. మైసూరు దసరా వేడుకలకు దాదాపు 500 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ వేడుకలను చూసేందుకు దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తారు. ఇక్కడి దసరా వేడుకలు కేవలం అమ్మవారి పూజలకే పరిమితం కాదు. ఆ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయి.


మైసూరులోని అమ్మవారి పేరు చాముండేశ్వరీదేవి. శరన్నవరాత్రోత్సవాల్లో చాముండేశ్వరి దేవి వైభవం చూసేందుకు రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. మైసూరులో దసరా ఉత్సవాలను  చూసేందుకు ప్రతీ యేటా లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తూంటారు. మైసూరు మహారాజు పాలన కాలం నుండి దసరా ఉత్సవాలను వైభవంగా జరుపుకోవడం అక్కడ ఆనవాయితీ. మైసూరు మహారాజు వారి కులదైవం అయిన చాముండేశ్వరీ దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగింపుగా తీసుకొస్తారు. ఆ వేడుక కన్నుల పండువగా సాగుతుంది.


అలాగే, నవరాత్రుల్లో తొమ్మిదో రోజున రాచ ఖడ్గాన్ని ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో కలిపి ఊరేగింపుగా తీసుకువచ్చి, పూజలు చేస్తారు. ఆ సమయంలో వీధులలో కోలాహలంగా చేసే అనేక కళా ప్రదర్శనలు చూడటానికి దేశం నలుమూలల నుండి ప్రజలు వస్తుంటారు. మైసూర్ ప్యాలెస్ నుంచి బన్నీ మంటపం వరకు నిర్వహించే ఈ ఊరేగింపు అత్యద్భుతంగా ఉంటుంది. ఆసమయంలో మైసూరు రాజభవనం ప్రత్యేకంగా అలంకరించ బడుతుంది. ఆ సమయంలో ఫ్లోటింగ్ కారు ఉత్సవాలు  కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో జరిగే దుర్గామాత పూజలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధిచెందాయి. బెంగాలీలు అత్యంత భక్తిశ్రద్ధలతో కాళీమాతను కొలుస్తారు. సప్తమి, అష్టమి, నవమి తిధులలో దుర్గామాతకు పూజ చేసి తొమ్మిదవ రోజున కాళికామాతను దర్శిస్తారు. దసరానాడు కాళీమాతను లక్షలమంది దర్శించుకుంటారు. తొమ్మిది రోజులూ రాష్ట్రమంతా హరికథలు, పురాణ శ్రవణం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజున దుర్గామాతను హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఆరోజున నదీతీరంలో కుమారీ పూజలు చేయడం బెంగాలీల ప్రత్యేకత.


కోల్‌కతా నగరమంతా నవరాత్రుల సమయంలో ఏ వీధి చూసినా దుర్గా పూజ ఉత్సవాలతో కోలాహలంగా ఉంటుంది. పశ్చిమ బెంగాల్‌ వ్యాప్తంగా కూడా ఇదే ఆనవాయితీ కొనసాగుతుంది. దుర్గా మండపాల వద్ద తొమ్మిది రోజుల పాటు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రకాల తినుబండారాలతో నిర్వహించే ఫుడ్‌ ఫెస్టివల్స్‌ అందరినీ ఆకట్టుకుంటాయి. లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా దుర్గాదేవీ మండపాలను రూపొందిస్తారు. అవి సినిమా సెట్టింగులను తలపిస్తాయి. దుర్గా ఫెస్టివల్ సందర్భంగా భారతదేశం నలుమూలల్లో నుంచి అనేక మంది టూరిస్టులు ఈ మండపాలను చూడడానికే వస్తుంటారు. దసరా సందర్భంగా ఏర్పాటు చేసే మండపాల మధ్య పోటీలు కూడా నిర్వహించి ఉత్తమమైన వాటికి బహుమతులు అందజేస్తారు. 


కోల్‌కతాలో ఏర్పాటు చేసే కొన్ని దుర్గా మండపాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఉత్తర కోల్‌కతాలోని బాగ్‌ బజార్‌లో నిర్వహించే వేడుకలు బెంగాలీ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. అత్యంత ప్రాచీన దుర్గాపూజా మండపంగా ఇది ప్రసిద్ధిపొందింది. అక్కడి మైదానంలో ట్రెడిషనల్ స్టాల్స్, ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తారు.


కోల్‌కతాలోని కాలేజ్‌ స్క్వేర్‌ వద్ద 1948 నుంచి దుర్గా పూజ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతియేటా ప్రత్యేకమైన విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు. ఆ దుర్గామాత విగ్రహంతో పాటు, అక్కడ ఏర్పాటుచేసే థీమ్ లైటింగ్, పక్కనే ఉన్న సరస్సులో నీటిపై విగ్రహ ప్రతిబింబం చూడటానికి ప్రజలు ఈ మండపం వద్దకు భారీగా చేరుకుంటారు.


ఇక, సెంట్రల్‌ కోల్‌కతాలో ఉన్న మొహమ్మద్ అలీ పార్క్ దగ్గర ఏర్పాటు చేసే దుర్గాదేవి మండపం కూడా ప్రసిద్ధిచెందింది. బదమ్‌తాలా ఆషర్ సంఘా ప్రాంతంలోనూ పలు ఘట్టాలకు ప్రతీకంగా దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించడం ఆనవాయితీ.  ఇక, ఎక్డాలియా ఎవర్‌గ్రీన్ అనే ప్రాంతంలో 1943 నుంచి దుర్గా పూజ ప్రారంభమైంది. కోల్‌కతాలోని ఎత్తైన దుర్గాదేవి విగ్రహాల్లో ఇది ఒకటిగా పేరొందింది. 


ఇటు, ఒడిశాలోనూ దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అక్కడి ప్రజలు దుర్గామాతను ఆరాధిస్తారు. కటక్ కళాకారులు రూపొందించిన దుర్గామాత విగ్రహాలను వీధివీధిలో ప్రతిష్ఠిస్తారు. స్త్రీలు మానికలో వడ్లు నింపి లక్ష్మీ దేవిగా భావించి పూజలు నిర్వహిస్తారు. విజయదశమి నాడు విజయదుర్గను ఆరాధిస్తే అన్నిటా విజయం సిద్ధిస్తుందని ఒడిశా ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తారు. చివరి రోజున 15 అడుగుల రావణ విగ్రహాన్ని బాణసంచాతో తయారు చేసి మైదానంలో కాలుస్తారు. ఈ రావణ కాష్టం చూడటానికి ప్రజల తండోపతండాలుగా వస్తారు. 


దసరా సమయంలో గుజరాత్‌లో పార్వతిదేవి ఆరాధన చేస్తారు. ఇంటింటా శక్తి పూజ చేయడం గుజరాతీయుల ఆచారం. ఇంటి గోడల మీద శ్రీ చక్రాన్ని, త్రిశూలాన్ని, శక్తి ఆయుధాన్ని పసుపుతో చిత్రించి పూజిస్తారు. ఆ గుర్తుల సమీపంలో పొలం నుండి తీసుకు వచ్చిన మట్టితో వేదిక తయారు చేసి దానిపై బార్లీ, గోధుమ విత్తనాలను చల్లి దానిపై మట్టి ఉండ పెట్టి దానిని నీటితో నింపి పోకచెక్క వెండి లేక రాగి నాణెం వేస్తారు. ఆ మట్టికుండను వారు దేవిగా భావిస్తారు. దానిని వారు కుంభీ ప్రతిష్ట అంటారు. అష్టమి రోజున యజ్ఞం నిర్వహించి దశమి రోజున నిమజ్జనం చేస్తారు. అమ్మవారి వద్ద పెట్టిన ప్రమిదను గుడిలో సమర్పిసారు. తరువాత పౌర్ణమి వరకూ గర్భా పేరుతో జరిగే ఉత్సవాలలో స్త్రీలు ఉత్సాహంగా పాల్గొంటారు. డోలు భాజాలు వాయిస్తూ రంగు రంగుల దుస్తుల్లో కళాకారులు ప్రదర్శించే గర్భా నృత్యాలు అందరినీ ఆకట్టుకుంటాయి. అమ్మవారికి నిర్వహించే 'గుజరాతీ హారతి' నృత్యం చూసి తీరాల్సిందే...


- సప్తగిరి గోపగోని, చీఫ్‌ సబ్‌ ఎడిటర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి

Updated Date - 2020-10-25T01:41:34+05:30 IST