‘అష్ట దిగ్బంధనం సమయంలో మూడు రెట్లు పెరిగిన మానసిక సమస్యలు’
ABN , First Publish Date - 2020-10-04T00:17:16+05:30 IST
కోవిడ్-19 మహమ్మారి ప్రభావం ప్రజా జీవనంపై తీవ్రంగా పడింది. ఈ మహమ్మారిని నిరోధించేందుకు అమలు చేసిన అష్ట దిగ్బంధనం సమయంలో

లండన్ : కోవిడ్-19 మహమ్మారి ప్రభావం ప్రజా జీవనంపై తీవ్రంగా పడింది. ఈ మహమ్మారిని నిరోధించేందుకు అమలు చేసిన అష్ట దిగ్బంధనం సమయంలో మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నవారి సంఖ్య చాలా పెరిగింది. కుంగిపోవడం (డిప్రెషన్), బెంగ (యాంగ్జైటీ) మూడు రెట్లు పెరిగింది. బ్రిటన్, ఆస్ట్రియా, బెల్జియం దేశాల్లోని విశ్వవిద్యాలయాలకు చెందిన నిపుణుల బృందం నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
‘సైకోసోమటిక్ మెడిసిన్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయన నివేదికలో తెలిపిన వివరాల ప్రకారం, కుంగిపోవడం, బెంగపెట్టుకోవడం వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య అష్ట దిగ్బంధనం సమయంలో మూడు రెట్లు పెరిగింది. మానసిక సంక్షేమం విషయంలో ప్రాంతాలనుబట్టి తేడాలు కనిపించింది. సాంఘిక, ఆర్థిక రంగాల్లో దెబ్బతిన్న ప్రాంతాల్లో కుంగుబాటుతో బాధపడేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.
కోవిడ్-19కు ముందు లెక్కల ప్రకారం కుంగుబాటు, బెంగతో బాధపడేవారు 17 శాతం కాగా, అష్ట దిగ్బంధనం అమలైన ఏప్రిల్‌లో వీరి సంఖ్య 52 శాతానికి పెరిగింది. యువత, మహిళలు, నిరుద్యోగులు, అల్పాదాయ వర్గాలవారు అష్ట దిగ్బంధనం వల్ల ఎక్కువగా మానసిక ఆరోగ్య సమస్యలకు గురయ్యారు.
షెఫీల్డ్ విశ్వవిద్యాలయం సైకాలజీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన డాక్టర్ జైమే డెల్గాడియో మాట్లాడుతూ, దేశ ప్రజల మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అత్యవసర సమస్య పట్ల దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజల మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించాలని విధాన నిర్ణేతలకు, ఆరోగ్య సేవల రంగాలకు ఈ అధ్యయన ఫలితాలు తెలియజేస్తున్నాయని చెప్పారు.
షెఫీల్డ్ విశ్వవిద్యాలయంలోని క్లినికల్ సైకాలజీ ప్రొఫెసర్ మైఖేల్ బర్ఖామ్ మాట్లాడుతూ, కోవిడ్-19కు ప్రజల మానసిక ఆరోగ్య సమస్యలకు సంబంధం ఉన్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైందన్నారు.
డొనావ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ థామస్, ప్రొఫెసర్ క్రిస్టోఫ్ నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయన బృందంలో ఆస్ట్రియా, బెల్జియం, బ్రిటిష్ శాస్త్రవేత్తలు ఉన్నారు.