'ఉగ్రవాద గంగోత్రి' డియోబండ్ : కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-02-12T20:37:55+05:30 IST

పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా గత జనవరి 27 నుంచి వందలాది మంది మహిళలు నిరసన తెలుపుతున్న ఉత్తరప్రదేశ్‌లోని డియోబండ్‌పై కేంద్ర మంత్రి..

'ఉగ్రవాద గంగోత్రి' డియోబండ్ : కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

లక్నో: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా గత జనవరి 27 నుంచి వందలాది మంది మహిళలు నిరసన తెలుపుతున్న ఉత్తరప్రదేశ్‌లోని డియోబండ్‌పై కేంద్ర మంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదానికి పుట్టకస్థలం (ఉగ్రవాద గంగోత్రి) డియోబండ్ అని, లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సహా అనేక మంది ఇక్కడే పుట్టారని వ్యాఖ్యానించారు.


'డియోబండ్‌కు చెందిన వారు (సీఏఏ వ్యతిరేకులు) టెర్రరిస్టులని నేను ముందునుంచీ చెబుతూనే ఉన్నాను. ప్రపంచంలోని కరడుకట్టిన ఉగ్రవాదులంతా ఇక్కడి నుంచే వచ్చారు. ఉగ్రవాదానికి ఇది పుట్టక స్థలమని ఇంతకుముందు కూడా నేను చెప్పాను. హఫీజ్ సయీద్ ఇక్కడి నుంచే వచ్చాడు' అని షహరాన్‌పూర్‌లో మీడియాతో మాట్లాడుతూ మంత్రి అన్నారు.


గత నెల 27 నుంచి సీఏఏకు వ్యతిరేకంగా డియోబండ్‌లో మహిళలు జరుపుతున్న ప్రదర్శలను విరమించాలని మతపెద్దలు విజ్ఞప్తి చేసినప్పటికీ మహిళలు అందుకు నిరాకరిస్తున్నారు. ప్రఖ్యాత ఇస్లామిక్ సెమినరీ ఆప్ దారుల్ ఉలూమ్ డియోబండ్‌లోనే ఉంది. సీఏఏ, ప్రతిపాదిత ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా పాన్ ఇండియా ఉద్యమాన్ని దారుల్ ఉలూమ్ సమర్ధిస్తోంది. భారత రాజ్యాంగ పరిరక్షణకే తాము నిరసనలు చేస్తున్నట్టు చెబుతోంది. సీఏఏకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం, సీజేఐలకు మెమొరాండం కూడా సమర్పించింది.

Updated Date - 2020-02-12T20:37:55+05:30 IST