ఢిల్లీ అల్లర్లు పెద్ద కుట్ర: అమిత్‌ షా

ABN , First Publish Date - 2020-03-12T07:45:54+05:30 IST

ఢిల్లీ అల్లర్లు పథకం ప్రకారం జరిగిన పెద్ద కుట్ర అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. అల్లర్లలో పాల్గొన్నవారు ఏవర్గం వారైనా వదిలిపెట్టబోమన్నారు. అయితే అమాయకులపై...

ఢిల్లీ అల్లర్లు పెద్ద కుట్ర: అమిత్‌ షా

న్యూఢిల్లీ, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ అల్లర్లు పథకం ప్రకారం జరిగిన పెద్ద కుట్ర అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. అల్లర్లలో పాల్గొన్నవారు ఏవర్గం వారైనా వదిలిపెట్టబోమన్నారు. అయితే అమాయకులపై చర్యలు తీసుకునే ప్రసక్తే లేదన్నారు. ఢిల్లీ అల్లర్లపై లోక్‌సభలో బుధవారం జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. హోలీ సమయంలో మతకల్లోలాలు మళ్లీ జరిగే అవకాశాలున్నాయని భావించినందువల్లే హోలీ తర్వాత చర్చకు అంగీకరించామని చెప్పారు. ఈ అల్లర్లలో దాదాపు 1100 మంది పాల్గొన్నారని, ఉత్తరప్రదేశ్‌ నుంచి 300 మంది రంగంలోకి దిగారని చెప్పారు. ముఖాన్ని గుర్తించే టెక్నాలజీ ద్వారా అందరినీ గుర్తిస్తామని, అల్లర్లను ప్రేరేపించేందుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీస్తున్నామని తెలిపారు.


అన్ని చోట్ల నుంచి వీడియోలు తెప్పించుకున్నామని, ఐబీ అధికారి అంకిత్‌శర్మ హత్యకు సంబంధించిన వీడియో కూడా దొరికిందన్నారు. ద్వేష భావాలను వ్యాప్తి చేసే నకిలీ సోషల్‌ మీడియా ఖాతాల వెనుక ఎవరున్నారో పోలీసులు కనిపెడతారన్నారు. అల్లర్లలో మరణించిన వారికి అమిత్‌ షా నివాళులర్పించారు. ఫిబ్రవరి 25 రాత్రి 11 గంటల తర్వాత ఎక్కడా హింసాకాండ జరగలేదని, 36 గంటల్లో అల్లర్లను అదుపు చేయడంతోపాటు ఢిల్లీ అంతటా అల్లర్లు వ్యాప్తి చెందకుండా పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన నియోజకవర్గానికి వచ్చినందువల్లే తాను అహ్మదాబాద్‌ వెళ్లానన్నారు. తన అభ్యర్థన మేరకే జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోభాల్‌ ఆయా ప్రాంతాల్లో పర్యటించారని చెప్పారు. కాగా హోం మంత్రి జవాబు చెబుతుండగానే కాంగ్రెస్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

Updated Date - 2020-03-12T07:45:54+05:30 IST