వ్యాక్సిన్ వచ్చేదాకా స్కూళ్లు తెరిచేది లేదు: మనీశ్ సిసోడియా

ABN , First Publish Date - 2020-11-26T01:53:59+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా ఢిల్లీలో మూతపడిన పాఠశాలలు వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చే వరకు తెరుచుకునే అవకాశాలు లేవని ఢిల్లీ డిప్యూటీ సీఎం..

వ్యాక్సిన్ వచ్చేదాకా స్కూళ్లు తెరిచేది లేదు: మనీశ్ సిసోడియా

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఢిల్లీలో మూతపడిన పాఠశాలలు వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చే వరకు తెరుచుకునే అవకాశాలు లేవని ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యామంత్రి మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. కొవిడ్-19 వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో మార్చి 16 నుంచి అన్ని పాఠశాలలు, యూనివర్సిటీలు మూతపడిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం దశలవారీగా లాక్‌డౌన్ నిబంధనలను సడలించినప్పటికీ... చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో తదుపరి ఆదేశాలు వెలువరించే వరకు స్కూళ్లు తెరవొద్దంటూ సిసోడియా ఇటీవల ప్రకటించారు. గత కొద్ది వారాలుగా కొత్త కేసులు పెరుగుతుండడంతో ఢిల్లీ ప్రభుత్వం ప్రస్తుతం కంటిమీద కునుకులేకుండా గడుపుతోంది. నవంబర్ 1 నుంచి ఇప్పటి వరకు దాదాపు లక్షకు పైగా కొత్త పాజిటివ్ కేసులు వచ్చాయి. గత వారం రోజులుగా రోజుకు సగటున 6 వేల చొప్పన కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చలికాలం ప్రారంభం కావడంతో పాటు వాయు కాలుష్యం కూడా కేసులు అమాంతం పెరిగేందుకు కారణమైనట్టు నిపుణులు చెబుతున్నారు. 

Read more