ఢిల్లీలో కొత్తగా 1250 కేసులు వెలుగులోకి.. 13 మంది మృతి
ABN , First Publish Date - 2020-08-22T23:06:53+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీలో గత 24 గంటల్లో 1,250 కొత్త కొవిడ్ కేసులు నమోదైనట్టు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గత 24 గంటల్లో కొత్తగా 1,250 కొవిడ్ కేసులు నమోదైనట్టు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ శనివారం తెలిపారు. అలాగే, కొత్తగా 1,082 మంది కోలుకోగా, 13 మంది మృత్యువాత పడినట్టు పేర్కొన్నారు. రాజధానిలో కొవిడ్ మరణాలను తగ్గించేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. కొవిడ్ మరణాలను పూర్తిగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. మరణాల రేటును కనీస స్థాయికి తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. అంబులెన్స్ రాక సమయం కూడా 18 శాతానికి తగ్గిందని మంత్రి వివరించారు. ఢిల్లీలో హోటళ్లు తెరవడానికి సంబంధించి కేంద్రం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం హోటళ్లు తెరుస్తామని చెప్పారు. భౌతిక దూరం పాటిస్తూ వారాంతపు సంతలు పనిచేస్తాయన్నారు. బాంక్వెట్ హాళ్లను ఆసుపత్రుల నుంచి తొలగిస్తున్నట్టు చెప్పిన మంత్రి.. ఇకపై వాటి అవసరం లేదన్నారు. రాజధానిలో 10 వేల కొవిడ్-19 బెడ్లు ఖాళీగా ఉన్నట్టు వివరించారు.