ఢిల్లీలోని హౌజ్ రాణి నుంచి యాంటీ సీఏఏ ప్రొటెస్టర్లను ఖాళీ చేయించిన పోలీసులు

ABN , First Publish Date - 2020-03-24T19:32:40+05:30 IST

కరోనా వైరస్ మహమ్మారిపై యుద్ధంలో భాగంగా దేశ రాజధాని నగరం ఢిల్లీ అష్టదిగ్బంధనంలో ఉన్న నేపథ్యంలో పోలీసులు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసనకారులను హౌజ్ రాణి ప్రాంతం నుంచి మంగళవారం ఖాళీ చేయించారు.

ఢిల్లీలోని హౌజ్ రాణి నుంచి యాంటీ సీఏఏ ప్రొటెస్టర్లను ఖాళీ చేయించిన పోలీసులు

న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారిపై యుద్ధంలో భాగంగా దేశ రాజధాని నగరం ఢిల్లీ అష్టదిగ్బంధనంలో ఉన్న నేపథ్యంలో పోలీసులు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసనకారులను హౌజ్ రాణి ప్రాంతం నుంచి మంగళవారం ఖాళీ చేయించారు. 


ఈ నెల 31 వరకు సీఆర్‌పీసీ సెక్షన్‌ను అమలు చేయనున్న నేపథ్యంలో దేశ రాజధాని నగరంలో ప్రజలు ఒక చోట సామూహికంగా చేరడంపై ఆంక్షలు విధించారు. 


సీఏఏను వ్యతిరేకిస్తూ షహీన్ బాగ్‌లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నవారిని కూడా ఆ ప్రాంతం నుంచి పోలీసులు మంగళవారం ఖాళీ చేయించారు. ఢిల్లీలో అష్ట దిగ్బంధనం అమలవుతున్న సమయంలో చట్ట వ్యతిరేకంగా సమావేశమైనందుకు 9 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. 


ఢిల్లీ ఆగ్నేయ విభాగం డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆర్ పీ మీనా మాట్లాడుతూ షహీన్‌బాగ్‌లో తొమ్మిది మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నామని, వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారని తెలిపారు. వీరందరినీ సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. 


ఇదిలావుండగా నిరసనకారులు కొంత సేపటి తర్వాత మళ్ళీ యథావిధిగా ఒక చోటకు చేరి, తమ నిరసనను కొనసాగించారు. 


ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో మతపరమైన హింస, వేధింపులను ఎదుర్కొనలేక, భారత దేశానికి వచ్చిన హిందూ, జైన, బౌద్ధ, పారశీక, సిక్కు, క్రైస్తవ శరణార్థులకు భారత దేశ పౌరసత్వం ఇవ్వాలన్నది సీఏఏ లక్ష్యం. 2014 డిసెంబరు 31కి ముందు ఆరు సంవత్సరాలపాటు భారత దేశంలో ఉన్నవారికి ఈ విధంగా పౌరసత్వం ఇస్తారు. 


ఈ దేశాల నుంచి వచ్చిన ముస్లింలకు పౌరసత్వం కల్పించేందుకు ఈ చట్టం అవకాశం కల్పించడం లేదంటూ దాదాపు 3 నెలల నుంచి నిరసనలు కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.Read more