ఇస్లామిక్ స్టేట్‌తో అనుబంధంగల ఇద్దరి అరెస్ట్
ABN , First Publish Date - 2020-03-08T21:57:06+05:30 IST
ఇస్లామిక్ స్టేట్-ఖొరసాన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ)తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు ఆదివారం ఇద్దర్ని అరెస్టు చేశారు. వీరిద్దరూ కశ్మీరుకు చెందినవారు,

న్యూఢిల్లీ : ఇస్లామిక్ స్టేట్-ఖొరసాన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ)తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు ఆదివారం ఇద్దర్ని అరెస్టు చేశారు. వీరిద్దరూ కశ్మీరుకు చెందినవారు, ఢిల్లీలోని జామియా నగర్‌లో వీరిని అరెస్టు చేశారు. ఉగ్రవాద దాడులకు ముస్లిం యువతను ప్రేరేపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ పోలీసు విభాగంలోని డిప్యూటీ పోలీస్ కమిషనర్ ప్రమోద్ సింగ్ కుష్వాహా తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ ఢిల్లీలోని ఓఖ్లా, జామియా నగర్‌లో కశ్మీరుకు చెందిన జహానాజెయిబ్ సమి, అతని భార్య హీనా బషీర్ బేగ్‌లను అరెస్టు చేశారు. వీరిద్దరూ ఇస్లామిక్ స్టేట్ ఖొరసాన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ)కి చెందినవారు. వీరు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా నిరసనలను రెచ్చగొట్టారు.
ఐఎస్‌కేపీ 2015 నుంచి ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోంది. ఈ ఉగ్రవాద సంస్థ ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లలో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీరు ఆఫ్ఘనిస్థాన్‌లోని ఐఎస్‌కేపీ ఉన్నత స్థాయి నాయకులతో సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. భారత దేశంలో ఆత్మాహుతి దాడులు నిర్వహించేందుకు ఆయుధాల సేకరణకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
జహానాజెయిబ్ ప్రస్తుతం సైబర్ స్పేస్‌లో ఉగ్రవాద ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం జమ్మూ-కశ్మీరుపై మాత్రమే కాకుండా భారత దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఈ సంస్థ కార్యకలాపాలు విస్తరించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
నిఘా అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం జహానాజెయిబ్ సమి పాకిస్థాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ - కొరసాన్ విభాగం కమాండర్ హుజైఫా అల్ - బాకిస్తానీతో సంప్రదింపులు జరుపుతున్నాడు. ఈ ఉగ్రవాద సంస్థలో చేరేవిధంగా కశ్మీరీ యువతను రెచ్చగొట్టడంలో హుజెయిఫా కీలక పాత్ర పోషించాడు.