ఎల్లో లైన్‌పై ఢిల్లీ మెట్రో సర్వీసు రెడీ...

ABN , First Publish Date - 2020-09-07T00:01:03+05:30 IST

కేంద్ర ప్రభుత్వ అన్‌లాక్-4 మార్గదర్శకాల్లో భాగంగా దశలవారీ మెట్రో సర్వీసుల పునరుద్ధరణను సోమవారం..

ఎల్లో లైన్‌పై ఢిల్లీ మెట్రో సర్వీసు రెడీ...

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ అన్‌లాక్-4 మార్గదర్శకాల్లో భాగంగా దశలవారీ మెట్రో సర్వీసుల పునరుద్ధరణను సోమవారం నుంచి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ప్రారంభించనుంది. తొలుత 'ఎల్లో లైన్'పై మెట్రో సర్వీసులు మొదలవుతున్నాయి. సమయపూర్ బడ్లి నుంచి హుడా సిటీ సెంటర్, రాపిడ్ మెట్రో లైన్ నుంచి గురుగావ్ వరకూ ఈ సేవలు ఉంటాయి.


అన్ని డిపోల్లోనూ పరిశుభ్రత, శానిటైజేషన్ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నప్పటకీ ఇతర మెట్రో లైన్స్‌లో దశలవారీగా సర్వీసులు ప్రారంభించాలని డీఎంఆర్‌సీ భావిస్తోంది. వైరస్ ట్రాన్స్‌మిషన్‌ జరక్కుండా చూసేందుకు సాధ్యమైనంత వరకూ అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని ప్రయాణికులకు డీఎంఆర్‌ సూచించింది. ఫేస్‌మాస్క్‌లు లేని వారిని, శానిటేషన్, భద్రతా నిబంధనలు పాటించని వారిని మెట్రో స్టేషన్లలోకి అనుమతించమని స్పష్టం చేసింది.


మరిన్ని ముఖ్యాంశాలు...

సోమ, మంగళ వారాల్లో ఎల్లో లైన్‌పై మెట్రో సేవలను రెండు షిప్టులుగా నడపనున్నారు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకూ, తిరిగి మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఈ సర్వీసులు నడపుతార. ప్యాసింజర్ల భద్రత దృష్ట్యా మెట్రో స్టేషన్లలో ఒకటి లేదా రెండు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను (గేట్లు) తెరుస్తారు. ప్రయాణికులు కూడా ఈ గేట్ల వివరాలను డీఎంఆర్‌సీ వెబ్‌సైట్‌ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అలాగే ప్రయాణికులు రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు సామాజిక దూరం, స్వచ్ఛమైన గాలి సర్క్యులేట్ అయ్యేందుకు వీలుగా 10 నుంచి 20 సెకెండ్లు అదనంగా మెట్రో డోర్లను తెరిచి ఉంచుతారు.


అలాగే, మెట్రో ప్రయాణాలకు నగదు లావాదేవీలు ఉండవు. స్టేషన్లలో టోకెన్లు అందుబాటులో ఉంచడం లేనందున స్మార్ట్ కార్డ్‌లను వాడాలని ఢిల్లీ మెట్రో సూచించింది. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ వెంబడి కంటైన్మెంట్ జోన్ల పరిధిలోకి వచ్చే మెట్రో స్టేషన్లలో మాత్రం సర్వీసులను పునరుద్ధరించడం లేదు. అలాంటి జోన్ల విషయమై ఎప్పటికప్పుడు సమాచారం అప్‌డేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను డీఎంఆర్‌సీ కోరింది. అలాగే ప్రయాణికులు తేలిపగా తీసుకువెళ్లే వస్తువులతో ప్రయాణించాలని, అందువల్ల సామాజిక దూరం పాటించడం సులభతరమవుతుందని ఢిల్లీ మెట్రో సూచించింది. 30 ఎంఎల్ పాకెట్ సైజ్ హ్యాండ్ శానిటైజర్లను మాత్రమే మెట్రో స్టేషన్లలో అనుమతిస్తామని తెలిపింది.

Updated Date - 2020-09-07T00:01:03+05:30 IST