ఢిల్లీలో హోం క్వారంటైన్ య‌ధాత‌థం... 24 గంట‌ల్లో ఎల్‌జీ నిర్ణ‌యం వెన‌క్కి!

ABN , First Publish Date - 2020-06-21T11:34:02+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అనియంత్రితంగా మారాయి. ఇటువంటి ప‌రిస్థితుల్లో క‌రోనా బాధితుల హోం క్వారంటైన్ విష‌యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తీసుకున్న నిర్ణ‌యం 24 గంటల్లో...

ఢిల్లీలో హోం క్వారంటైన్ య‌ధాత‌థం... 24 గంట‌ల్లో ఎల్‌జీ నిర్ణ‌యం వెన‌క్కి!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అనియంత్రితంగా మారాయి. ఇటువంటి ప‌రిస్థితుల్లో క‌రోనా బాధితుల హోం క్వారంటైన్ విష‌యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తీసుకున్న నిర్ణ‌యం 24 గంటల్లో ఉపసంహరించుకోవలసి వచ్చింది. ఎల్‌జీ ఆదేశాల ప్ర‌కారం కరోనా బాధితులు ఐదు రోజులపాటు ప్ర‌భుత్వ క్వారంటైన్‌లో ఉండాలి. ఈ  నిర్ణయంపై ఢిల్లీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫ‌లితంగా లెఫ్టినెంట్ గవర్నర్ తన నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకోవాల్సి వ‌చ్చింది. ఆసుపత్రులలో పడకల కొరత, కరోనా రోగుల సంఖ్య పెరగడం, వైద్యులు, నర్సుల కొరత మొద‌లైన అంశాల‌పై ఢిల్లీ ప్రభుత్వం ప్ర‌శ్న‌లు లేవ‌నెత్త‌డంతో లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ప‌రిస్థితిని అర్థం చేసుకుని త‌న నిర్ణ‌యం మార్చుకున్నారు. ఢిల్లీలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 53,116 కు పెరిగిన ప్ర‌స్తుత‌ పరిస్థితుల్లో వారంద‌రికీ  ప్రభుత్వం క్వారంటైన్ సదుపాయాలు కల్పించడం పెద్ద స‌మ‌స్య‌గా మారింది. మ‌రోవైపు హోం క్వారంటైన్‌లో ఉన్న బాధితుల‌ రికవరీ రేటు బాగానే ఉంద‌ని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. కాగా ఎల్‌జీ తాజా నిర్ణయంపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా హ‌ర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-06-21T11:34:02+05:30 IST