కోవిడ్-19: క్రిస్టియన్ మైఖేల్‌కు మధ్యంతర బెయిల్ తిరస్కరణ

ABN , First Publish Date - 2020-04-07T21:44:02+05:30 IST

అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో కీలక నిందితుడు క్రిస్టియన్ మైఖేల్‌కు మధ్యంతర....

కోవిడ్-19: క్రిస్టియన్ మైఖేల్‌కు మధ్యంతర బెయిల్ తిరస్కరణ

న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో కీలక నిందితుడు క్రిస్టియన్ మైఖేల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉంటున్న తనకు కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. జస్టిస్ ముక్తా గుప్త వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పిటిషన్‌పై విచారణ జరిపారు. క్రిస్టియన్ మైఖేల్‌ను ప్రత్యేక సెల్‌లో ఉంచినందున బ్యారక్‌లో మాదిరిగా ఆయన అనేకమందితో కలిసే అవకాశం లేదనీ.. అందువల్ల ఆయనకు కరోనా వైరస్‌తో ప్రమాదం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. క్రిస్టియన్ మైఖేల్ ఉంటున్న ప్రత్యేక సెల్‌లో కేవలం ఇద్దరే ఉన్నారనీ.. వారిలో ఎవరికీ కోవిడ్-19 లేదని గుర్తు చేశారు.


తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనీ, ఇప్పటికే జైల్లో తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నందున కరోనా బారిన పడే అవకాశం ఉందని 59 ఏళ్ల క్రిస్టియన్ మైఖేల్ వాదించారు. అయితే ఆయనకు బెయిల్ మంజూరు చేయరాదంటూ సీబీఐ, ఈడీ ధర్మాసనాన్ని కోరాయి. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో మధ్యవర్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిస్టియన్ మైఖేల్‌ను... 2018 డిసెంబర్ 22న భారత దర్యాప్తు సంస్థలు దుబాయ్ నుంచి తీసుకొచ్చి అరెస్టు చేశాయి.

Updated Date - 2020-04-07T21:44:02+05:30 IST