విద్యార్థులను ఆన్‌లైన్ క్లాసులకు అనుమతించని ప్రైవేట్ పాఠశాలకు హైకోర్టు నోటీసు
ABN , First Publish Date - 2020-08-01T23:37:44+05:30 IST
ఫీజు చెల్లించలేదన్న కారణంతో ఇద్దరు విద్యార్థులను ఆన్‌లైన్ తరగతులకు

న్యూఢిల్లీ : ఫీజు చెల్లించలేదన్న కారణంతో ఇద్దరు విద్యార్థులను ఆన్‌లైన్ తరగతులకు హాజరు కానివ్వకపోవడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్, చైర్మన్‌కు నోటీసు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈ విద్యార్థులను అనుమతించకపోవడంపై వివరణ ఇవ్వాలని కోరింది.
ఈ ఇద్దరు విద్యార్థుల తండ్రి దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై జస్టిస్ ప్రతిభ ఎం సింగ్ నోటీసు జారీ చేశారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు చేపట్టరాదో చెప్పాలని ఆదేశించారు. ఆగస్టు 7న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొనాలని పాఠశాల ప్రిన్సిపాల్, చైర్మన్‌ను ఆదేశించారు.
ఈ ఇద్దరు విద్యార్థుల తండ్రి దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌లో, పాఠశాల పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించేందుకు తనకు అవకాశం లేకుండా బ్లాక్ చేశారని ఆరోపించారు. 2020 ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఫీజు చెల్లించకపోవడంతో ఈ పోర్టల్‌లో ప్రవేశించేందుకు తనను బ్లాక్ చేశారని చెప్పారు. పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయని, తమ పిల్లలను ఈ పరీక్షలకు సైతం హాజరుకానివ్వడం లేదని తెలిపారు.
తమ ఆదేశాలను తక్షణమే అమలు చేసి ఉండవలసిందని హైకోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు అంతకుముందు ఇచ్చిన ఆదేశాల్లో విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యేందుకు వీలుగా స్కూల్ పోర్టల్‌ను పిటిషనర్‌కు అందుబాటులో ఉంచాలని పాఠశాల యాజమాన్యానికి తెలిపింది.
పిటిషనర్ ఒక వారంలోగా ఫీజును పాఠశాలకు చెల్లించాలని, ఈలోగా పిటిషనర్ పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులకు అనుమతిని నిరాకరించరాదని ఆదేశించింది. పాఠశాల నిర్వహించే వర్చువల్/ఆన్‌లైన్ తరగతుల్లో పాల్గొనేందుకు పిటిషనర్‌ను అనుమతించాలని చెప్పింది. బాలల కెరీర్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది.