బ్రీత్ అనలైజర్ టెస్టులకు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ABN , First Publish Date - 2020-09-03T22:05:22+05:30 IST
కొవిడ్-19 మహమ్మారి కారణంగా ట్రాఫిక్ ఎయిర్ కంట్రోలర్లకు నిలిపివేసిన బ్రీత్ అనలైజర్ టెస్టులను తిరిగి ప్రారంభించేందుకు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

న్యూఢిల్లీ: కొవిడ్-19 మహమ్మారి కారణంగా ట్రాఫిక్ ఎయిర్ కంట్రోలర్లకు నిలిపివేసిన బ్రీత్ అనలైజర్ టెస్టులను తిరిగి ప్రారంభించేందుకు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్యూబ్ విధానం ద్వారా పరీక్షలు చేయవచ్చని తెలిపింది. ఈ ఏడాది మార్చి 23న ఇచ్చిన తీర్పులో మార్పులు చేయాలని కోరుతూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించిన జస్టిస్ నవీన్ చావ్లా సారథ్యంలోని సింగిల్ బెంచ్ ఈ మేరకు తీర్పు చెప్పింది. డీజీసీఏ తరపున కోర్టుకు హాజరైన అడ్వకేట్ అంజన గోసైన్ మాట్లాడుతూ.. ఓ వ్యక్తిలో ఆల్కహాల్ ఉన్నదీ, లేనిదీ తెలుసుకునేందుకు
బ్రీత్ అనలైజర్ టెస్టు అత్యంత విశ్వసనీయమైనదని చాలా చర్చల తర్వాత ఓ నిర్ణయానికి వచ్చినట్టు పేర్కొన్నారు. రక్త, మూత్ర పరీక్షల వంటి విధానాలు ఉన్నప్పటికీ ఆచరణాత్మకంగా అవి పరిగణింపబడవని, అలాగే ఇప్పటి వరకు సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్ (సీఏఆర్స్) ఇందుకు సంబంధించి ఎటువంటి నిబంధనలను లేవని పేర్కొన్నారు. డీజీసీఏ అప్లికేషన్‌ను ఆమోదించిన కోర్టు, పరిశుభ్రత, ఇతర నివారణ చర్యలకు సంబంధించి సూచనలు ఇచ్చేందుకు ఏటీసీ గిల్డ్‌కు స్వేచ్ఛ ఇచ్చింది. అలాగే, ట్యూబ్ విధానం ద్వారా పరీక్షలకు అనుమతి ఇచ్చింది.