బంగ్లాదేశ్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, కేంద్రానికి హైకోర్టు నోటీసు
ABN , First Publish Date - 2020-03-27T21:26:32+05:30 IST
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నిరోధం కోసం అమలు చేస్తున్న అష్ట దిగ్బంధనం నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో
న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నిరోధం కోసం అమలు చేస్తున్న అష్ట దిగ్బంధనం నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను రప్పించేందుకు చర్యలు చేపట్టాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను ఢిల్లీ హైకోర్టు విచారణకు చేపట్టింది. దీనిపై స్పందించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. భారతీయ విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలని తెలిపింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్, జస్టిస్ తల్వంత్ సింగ్ ధర్మాసనం ఈ నోటీసులు జారీ చేసింది.
న్యాయవాది గౌరవ్ బన్సల్ దాఖలు చేసిన ఈ పిల్‌పై ఢిల్లీ హైకోర్టు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ జరిపింది. తదుపరి విచారణ ఈ నెల 30న జరుగుతుందని తెలిపింది.
విదేశాల్లోని భారతీయ దౌత్య కారాలయాల్లో నోడల్ అధికారిని నియమించాలని పిటిషనర్ కోరారు. ఈ నోడల్ అధికారులను సంప్రదించేందుకు ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ చిరునామాలను బహిరంగంగా ప్రకటించాలని కోరారు. దీనివల్ల భారత దేశానికి బయట ఉన్న భారతీయులు తమకు సహాయం అవసరం అయినపుడు ఈ నోడల్ అధికారులను సంప్రదించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.
బంగ్లాదేశ్‌లో 581 మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. వారంతా భారతీయ అధికారుల సహాయం కోసం ఎదురు చూస్తున్నారన్నారు.