తబ్లిగీ కేసు విచారణ 28కి వాయిదా

ABN , First Publish Date - 2020-05-13T21:45:51+05:30 IST

తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్‌కు వ్యతిరేకంగా దాఖలైన కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను...

తబ్లిగీ కేసు విచారణ 28కి వాయిదా

న్యూఢిల్లీ: తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్‌కు వ్యతిరేకంగా దాఖలైన కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను ఈనెల 28వ తేదీకి ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు వాయిదా వేసింది. జస్టిస్ సిద్దార్ధ్ మృదుల్, జస్టిల్ అనూప్ జైరామ్ బంబానీలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసుపై విచారణను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత విచారణ సరిగా జరగడం లేదని నిరూపించే డాక్యుమెంట్లను పిటిషనర్ తమకు సమర్పించాలని కూడా బెంచ్ ఆదేశించింది.


కాగా, తమ విచారణ సరిగా జరగడం లేదనే వాదనతో ఢిల్లీ పోలీసులు విభేదించారు. తమ విచారణ సజావుగా సాగుతోందని, మరో ఏజెన్సీని కేసును బదలాయించాల్సిన పని లేదని తెలిపారు.


కరనా వైరస్ విస్తృతిని నిరోధించేందుకు పెద్దఎత్తున జనం గుమిగూడరాదన్న ఆంక్షలను తగ్లిబీ ఉల్లంఘించిందని పిటిషనర్ ఘన్‌శ్యామ్ ఉపాధ్యాయ్ అన్నారు. కరోనా ఆంక్షలకు భిన్నంగా విదేశీ ప్రతినిధులు, సభ్యులతో తబ్లిగీ జమాజ్ ఈ కార్యక్రమం నిర్వహించినందున చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసి, ఎన్ఐఏ విచారణకు అప్పగించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. మౌలానా సాద్‌కు లేదా ఆ సంస్థకు అల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలనున్నాయంటూ మీడియాలో వచ్చిన వార్తలను కూడా పిటిషన్‌కు ఆయన జోడించారు.


కాగా, ప్రస్తుతం ఈ కేసును ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో భాగంగా మౌలానా సూద్ తనయుడిని క్రైం బ్రాంచ్ పోలీసులు ఈనెల 6న ప్రశ్నించారు. నిజాముద్దీన్ మర్కజ్‌కు హాజరైన, యాజమాన్యంతో సంబంధం ఉన్న 20 మంది సభ్యుల వివరాలను సైతం పోలీసులు ప్రశ్నించారు. మౌలానా సూద్‌, మరి కొందరిపై ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 కింద పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Updated Date - 2020-05-13T21:45:51+05:30 IST