మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఓబీసీ రిజర్వేషన్లపై విచారణ వచ్చే నెల 10న

ABN , First Publish Date - 2020-06-23T22:10:40+05:30 IST

మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2020 విద్యా సంవత్సరంలో 27 శాతం సీట్లను ఓ

మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఓబీసీ రిజర్వేషన్లపై విచారణ వచ్చే నెల 10న

న్యూఢిల్లీ : మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2020 విద్యా సంవత్సరంలో 27 శాతం సీట్లను ఓబీసీలకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై తదుపరి విచారణ జూలై 10న జరుగుతుందని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. జస్టిస్ జయంత్ నాథ్ దర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ జరుపుతోంది. 


వైద్య, దంత వైద్య కళాశాలల్లో  ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన పిటిషన్ ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణలో ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. వచ్చే నెల 8న సుప్రీంకోర్టు విచారణ జరుపుతుందని పేర్కొన్నారు. దీంతో తదుపరి విచారణను ఢిల్లీ హైకోర్టు వచ్చే నెల 10కి వాయిదా వేసింది.  


పిటిషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, ఓబీసీలకు చెందవలసిన మెడికల్, డెంటల్ సీట్లు జనరల్ కేటగిరీకి చెందినవారితో భర్తీ అవుతున్నాయి. 2017-18, 2018-19 విద్యా సంవత్సరాల్లో రిజర్వేషన్లను పాటించి ఉన్నట్లయితే, దాదాపు 5,530 సీట్లు ఓబీసీలకు లభించి ఉండేవి, అయితే ఈ సీట్లను ఓబీసీలకు బదులుగా జనరల్ కేటగిరీ విద్యార్థులతో భర్తీ చేశారు. 


జాతీయ వెనుకబడిన తరగతుల సంఘం కార్యదర్శి ఎస్ గీత ఈ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి అప్పగించిన ఆలిండియా కోటా మెడికల్, డెంటల్ కాలేజీ సీట్లలో ప్రవేశాలకు 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేయలేదని వార్తా కథనాలను బట్టి తెలుస్తోందని పిటిషన్లో తెలిపారు. 2020 నీట్ పరీక్షల ఫలితాల అనంతరం ఈ కథనాలు వెలువడినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించారని, ఓబీసీలకు వర్తింపజేయలేదని, ఇది రాజ్యాంగంలోని అధికరణ 14ను ఉల్లంఘించడమేనని ఆరోపించారు. 


Updated Date - 2020-06-23T22:10:40+05:30 IST