మరో 4 మృతదేహాల వెలికితీత

ABN , First Publish Date - 2020-03-02T08:00:18+05:30 IST

అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో మరో 4 మృతదేహాలు ఆదివారం బయటపడ్డాయి. భాగీరథి విహార్‌, గోకుల్‌పురి మురుగునీటి కాలువల్లో ఈ శవాలను వెలికితీయడంతో అల్లర్లలో...

మరో 4 మృతదేహాల వెలికితీత

  • 46కు పెరిగిన ఢిల్లీ మరణాల సంఖ్య
  • ప్రజల్లో ధైర్యం నింపుతున్న ఖాకీలు
  • షాహీన్‌బాగ్‌లో అదనపు భద్రత 


న్యూఢిల్లీ, మార్చి 1: అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో మరో 4 మృతదేహాలు ఆదివారం బయటపడ్డాయి. భాగీరథి విహార్‌, గోకుల్‌పురి మురుగునీటి కాలువల్లో ఈ శవాలను వెలికితీయడంతో అల్లర్లలో మరణించిన వారి సంఖ్య 46కు చేరింది. ఈ ముగ్గురు మరణించిన ప్రాంతంలోనే ఐబీ అధికారి అంకిత్‌శర్మ కూడా హతమవడంతో వీరూ ఆ ఉన్మాదుల దుర్మార్గానికి బలై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ 32మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు గురు తేజ్‌బహదూర్‌ ఆస్పత్రివర్గాలు తెలిపాయి. ఇంకా ఆరుగురిని గుర్తించాల్సి ఉందని చెప్పాయి. 240 మంది గాయపడ్డారు. 254 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి న పోలీసులు 903 మందిని నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆయుధాల చట్టం కింద 41 మందిపై కేసులు పె ట్టారు. ‘‘పరిస్థితి పూర్తిగా అదుపులోకొచ్చింది.


సాధారణ జనజీవనం ఇబ్బంది లేకుండా సాగుతోంది’’ అని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. పోలీసులు ప్రతీ గల్లీలోకి వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. సోషల్‌ మీ డియా పోస్టులు నమ్మొద్దని, రెచ్చగొట్టేట్లున్నా, బెదిరించేట్లున్నా తమ దృష్టికి తేవాలని కోరారు. మళ్లీ పనుల్లోకెళ్లండని, ఏ ఇబ్బందీ ఉండదని చెబుతున్నారు. మరోవైపు రెండున్నర నెలలుగా నిరసన సాగుతున్న షాహీన్‌బాగ్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. షాహీన్‌బాగ్‌ లో నిరసన 1వ తేదీకల్లా ముగిసిపోవాలని హిందూ సేన హెచ్చరించడంతో గొడవలు జరగకుండా 144 సెక్షన్‌ విధించారు. 2 మహిళా దళాలతో పాటు 12 కం పెనీల పోలీసులను రంగంలోకి దించారు.  


తమ వారి కోసం మార్చురీ చుట్టూ..!

కొందరు తమ సంబంధీకుల ఆచూకీ తెలియక జీటీబీ ఆస్పత్రి మార్చురీ చుట్టూ తిరగడం పలువుర్ని కంట తడిపెట్టించింది. అల్లర్లు జరగిన రోజు నుంచీ కనబడకుండా పోయిన తన 19 ఏళ్ల కుమారుడి ఫోటో పట్టుకుని ఓమహిళ రోదిస్తూ మార్చురీలోని శవాలను చూసింది. బయటకు వచ్చాక సొమ్మసిల్లి పడిపోయిం ది. ఆమె కుమారుడి మృతదేహం అందులో లేదనీ, అయితే అతని ఆచూకీ కోసం ఆమె రోదిస్తోందని బం ధువులు చెప్పారు. నబీ జాన్‌ అనే మరో మహిళ కూడా ఈనెల 24 నుంచి అదృశ్యమైన తన సోదరుడు సల్మాన్‌ కోసం ఆస్పత్రి పరిసరాల్లో అనేక మందిని అడగడం పలువురిని ఆవేదనకు గురిచేసింది. సల్మాన్‌ భార్యను ఆందోళనకారులు చంపేశారని, 8, 6 ఏళ్ల వయసున్న వారి పిల్లలబతుకు ప్రశ్నార్థకమైందన్నారు. 


తుక్డే తుక్డే గ్యాంగ్‌ ఏమీ చేయలేదు : రవిశంకర్‌

అల్లర్లు జరిగిన ఈశాన్య ఢిల్లీలో ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌ ఆదివారం పాదయాత్ర చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ‘‘ఏ ఒక్కరూ విచ్చిన్నం చేయలేనంతటి ఉత్కృష్టమైనది భారతీయ వ్యవస్థ. తుక్డే తుక్డే గ్యాంగ్‌ ఈ దేశాన్ని ఏమీ చేయలేదు. ఘర్షణలు జరిగిన తరువాత కూడా రెండు మతాల వారు ఎప్పటిలాగే ఒకరికొకరు సహకారం అందించుకుంటున్నారు. ఇక్కడున్న మానవతావాదం, మానవసంబంధాలు అటువంటివి. ప్రసుత్త పరిస్థితుల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచడం ముఖ్యం’’ అని అన్నారు.  శాంతిని నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. అల్లర్లలో ఆస్తులు నష్టపోయిన కొన్ని కుటుంబాలను ఆయన కలిసి మాట్లాడారు.

Updated Date - 2020-03-02T08:00:18+05:30 IST