ఆ 36 మందిని నిర్దోషులుగా ప్రకటించిన ఢిల్లీ కోర్టు
ABN , First Publish Date - 2020-12-15T23:33:02+05:30 IST
కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించి తబ్లిగీ జమాత్‌లో జరిగిన మతపరమైన ప్రార్థనలకు హాజరయ్యారన్న ఆరోపణల నేపథ్యంలో...
తబ్లిగీ జమాత్ ప్రార్థనలకు హాజరైన 36 మంది విదేశీయులను నిర్దోషులుగా ప్రకటించిన ఢిల్లీ కోర్టు
ఢిల్లీ: కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించి తబ్లిగీ జమాత్‌లో జరిగిన మతపరమైన ప్రార్థనలకు హాజరయ్యారన్న ఆరోపణల నేపథ్యంలో విచారణ ఎదుర్కొంటున్న 36 మంది విదేశీయులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఢిల్లీ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. కోవిడ్-19 నిబంధనలు అమలులో ఉన్న సమయంలో మత ప్రార్థనల్లో పాల్గొన్నారన్న కారణంగా 955 మంది విదేశీయులపై ఢిల్లీ పోలీసులు అప్పట్లో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. వీసా నిబంధనలనూ ఉల్లంఘించారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. వీరిలో చాలా మంది.. లాక్‌డౌన్ నిబంధనలు ఎత్తేశాక, అంతర్జాతీయ రాకపోకలకు అనుమతిచ్చాక స్వదేశాలకు వెళ్లిపోయారు. 44 మంది ఢిల్లీలో విచారణను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. వీరిలో.. 8 మందిని ప్రాథమిక సాక్ష్యాలు లేవన్న కారణంగా ఢిల్లీ కోర్టు ఇప్పటికే విడుదల చేసింది. తాజాగా.. మిగిలిన 36 మందిని కూడా నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.
దీంతో.. విదేశాల నుంచి ప్రార్థనలకు హాజరైన తబ్లిగీ జమాత్ సభ్యుల విషయంలో నెలకొన్న వివాదానికి తెరపడింది. ఢిల్లీలో జరిగిన ఈ మత ప్రార్థనలకు దేశంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భారీగా హాజరయ్యారు. దీంతో.. ఆ ప్రాంతం కోవిడ్-19 హాట్‌స్పాట్‌గా మారింది. వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఆ ప్రార్థనలకు హాజరైన వారు తిరిగి రోడ్డు, రైలు మార్గాల్లో ప్రయాణించడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో కోవిడ్-19 వ్యాప్తి చెందినట్లుగా ఆ సందర్భంలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది.