వలస కూలీలకు సాయం చేసిన కాంగ్రెస్ నేత నిర్బంధం
ABN , First Publish Date - 2020-05-18T00:23:09+05:30 IST
వలస కూలీలను వాహనాల్లో ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ బోర్డర్‌కు తరలించిన ఢిల్లీ కాంగ్రెస్ నేతపై కేసు నమోదు చేసిన పోలీసులు

న్యూఢిల్లీ: వలస కూలీలను వాహనాల్లో ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ బోర్డర్‌కు తరలించిన ఢిల్లీ కాంగ్రెస్ నేతపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు. సామాజిక దూరం నిబంధనను ఉల్లంఘించి వలస కూలీలను తరలించాలంటూ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అనిల్ చౌదరిపై ఐపీసీ 188, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఢిల్లీలో చిక్కుకుపోయిన వలస కూలీలను అనిల్ చౌదరి ఈ రోజు పలు వాహనాల్లో ఢిల్లీలోని ఘాజీపూర్ బోర్డర్‌కు తరలించచారు. దాదాపు 300 మందిని ఆయన తరలించినట్టు పోలీసులు చెబుతున్నారు. దీంతో చౌదరి ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు.
కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు మార్చిలో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వలస కూలీలు చిక్కుకుపోయారు. మరోవైపు, లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు, దినసరి కూలీలకు పని లేకుండా పోయింది. చేతిలో డబ్బులు లేక, ఉండేందుకు షెల్టర్ లేక వలస కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో కొందరు వలస కార్మికులు ప్రాణాలకు తెగించి వందలాది కిలోమీటర్లు నడుచుకుంటూ స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు మరణించిన ఘటనలు కూడా ఉన్నాయి.