ప‌రుగులు పెట్టేందుకు మెట్రో సిద్ధం... అయితే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

ABN , First Publish Date - 2020-08-22T15:12:59+05:30 IST

వచ్చే నెల నుంచి మెట్రో రైళ్ల రాక‌పోక‌ల‌ను ప్రారంభించేందుకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబరు మొదటి వారం నుంచి మెట్రో రైళ్లు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రారంభమవుతాయని...

ప‌రుగులు పెట్టేందుకు మెట్రో సిద్ధం... అయితే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

న్యూఢిల్లీ: వచ్చే నెల నుంచి మెట్రో రైళ్ల రాక‌పోక‌ల‌ను ప్రారంభించేందుకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబరు మొదటి వారం నుంచి మెట్రో రైళ్లు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఢిల్లీ మెట్రో రైళ్లు,స్టేషన్లలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అన్ని చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు డీఎంఆర్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (పబ్లిక్ రిలేషన్స్) అనుజ్ దయాల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో మెట్రో రైళ్లు తిర‌గ‌నున్నాయి.  ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం కేంద్రానికి ఒక ప్రతిపాదన పంపింది. తొలుత‌ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే మెట్రోలో ప్రయాణించే అవకాశం ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్న‌ప‌క్షంలో, ప్ర‌యాణికులంద‌రికీ మెట్రోలో ప్ర‌యాణించే అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా ఉండేందుకు ఢిల్లీ మెట్రో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మెట్రో రైళ్లలో భౌతిక దూరం పాటించేందుకు ప్రతి కోచ్‌లో ఒక సీటుకు మ‌రో సీటుకు మ‌ధ్య ఇక్క‌డ కూర్చోవ‌ద్దని పేర్కొంటూ స్టిక్కర్లు అతికించారు. అలాగే ప్రతి కోచ్‌లో 50 శాతం మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించేందుకు అవ‌కాశం ఉంటుంది. ప్రయాణీకులు టోకెన్లకు బదులుగా స్మార్ట్ కార్డులు వినియోగించేలా ప్రోత్స‌హించ‌నున్నారు. జలుబు, జ్వరం త‌దిత‌ర‌ లక్షణాలున్న‌ ప్రయాణీకులకు మెట్రో స్టేషన్ ప్రాంగణంలోకి ప్రవేశం లభించదు. అటువంటి ప్రయాణీకులను మెట్రో స్టేషన్ గేట్‌లోనే గుర్తిస్తారు. భౌతిక దూర నియమాలను పాటించేందుకు మెట్రో రైలును గ‌తంలో కన్నా 30 సెకన్ల పాటు అధికంగా స్టేష‌న్‌లో నిలిపివుంచ‌నున్నారు.

Updated Date - 2020-08-22T15:12:59+05:30 IST